భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) చుట్టూ వివాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ఈ తరుణంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెజ్లర్లను కలవడం దేశ రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది. ఈ మేరకు హరియాణాలోని ఝజ్జర్ జిల్లాకు చెందిన వీరేందర్ అఖాడాలో రేజర్లతో భేటీ అయిన రాహుల్ గాంధీ.. పలు విషయాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. క్రీడాకారులపై లైంగిక వేధింపులు, తర్వాత ఎన్నికల వ్యవహారానికి సంబంధించిన విషయాలను క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారని, ఆయనతో సమావేశమైన ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా (Bajrang Poonia) తెలిపారు.
ఈ మేరకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల ఫలితాలకు నిరసనగా పలువురు రెజ్లర్లు తమ అవార్డులను వాపస్ చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశం అనంతరం పునియా మీడియాతో మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ ఒక రెజ్లర్ కాబట్టి రోజువారీ మా కార్యకలాపాలను చూడటానికి వచ్చారు. మాతో పాటు రెజ్లింగ్ కూడా చేశారు' అని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి : ‘">దేవర’.. రిలీజ్ కు ముందే భారీ ధరకు కొనేసిన ఓటీటీ ప్లాట్ ఫామ్!
ఇదిలావుంటే.. ఇటీవల జరిగిన రెజ్లింగ్ సమాఖ్య(WFI) ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్‌సింగ్ విజయం సాధించారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన రెజ్లర్లు.. సంజయ్ ఎన్నికపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించగా బజ్‌రంగ్ పునియా, వీరేందర్ యాదవ్ పద్మశ్రీ అవార్డులను తిరిగి ఇచ్చేశారు. ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వినేశ్ ఫొగాట్ సైతం ప్రకటించడం విశేషం. కాగా ఇదే సమయంలో తాను రెజ్లింగ్ వ్యవహారాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు బ్రిజ్ భూషణ్ ప్రకటించారు. క్రీడారాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు.