Constitution: రాహుల్ జీ ఇప్పటికైనా చరిత్ర తెలుసుకో!

దేశ పౌర హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి భుజస్కంధాల మీద ఉందని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త డా. కిరణ్ కుమార్ దాసరి అన్నారు. అంబేద్కర్ ను గౌరవించడమంటే రాజ్యాంగాన్ని- అంబేద్కర్ ను విడదీసి చూడలేమనే సత్యాన్ని రాహుల్ జీ ఇప్పటికైనా గ్రహించాలన్నారు.

Constitution: రాహుల్ జీ ఇప్పటికైనా చరిత్ర తెలుసుకో!
New Update

Kiran kumar: ఎప్పుడూలేనంతగా, ఎన్నడూజరగనంతగా పార్లమెంట్ లోపల, బయట 'రాజ్యాంగ రక్షణ' కేంద్రంగా ఒక చర్చ ప్రధానంగా జరుగుతోంది. అది గత ఆరేడు నెలలుగా నడుస్తూ వస్తోంది. మొన్న జరిగిన పార్లమెంట్ సాధారణ ఎన్నికల ప్రచారంలో దేశమంతా రాజ్యాంగ రక్షణే ప్రధానాయుధంగా పని చేసింది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని రాహుల్ నాయకత్వంలో పనిచేసిన ప్రతిపక్ష పార్టీలన్నీ విచ్చల విడి ప్రచారం మొత్తం దేశాన్నే కదిలించింది. ఈ రాజ్యాంగ రక్షణ అనే అంశం గత కొన్నేళ్లుగా వివిధ స్థాయిల్లో ప్రజల నాలుకల్లో నానుతూనే ఉంది. భీం ఆర్మీ వ్యవస్థాపకుడు, దళిత హక్కుల నాయకుడు అయిన ప్రస్తుత లోక్ సభ సభ్యుడు చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ 2019 ముందు నుండి రాజ్యాంగ హక్కుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణ పేరిట ప్రజలకు అవగాహన కల్పిస్తున్న స్ఫూర్తిని ప్రజలు అందరు కొనసాగించాలి.

ఇలా భారత దేశ చరిత్రలో రాజ్యాంగం మీద ఇంత చర్చ జరగడం ఇదే మొదటిసారి అనుకుంట. పార్లమెంటు వేదికగా అధికార, ప్రతి పక్షాలన్నీ ఒక అంశం మీద ఇంత పెద్ద ఎత్తున కొట్టుకోవడం గత రెండుమూడు దశాబ్దాలలో ఇదే ఫస్ట్ టైమ్ చూడడం. ఈ మధ్య ఇలాంటి చర్చ ఎప్పుడు జరుగలేదు. అలా రాజ్యాంగం చుట్టూ జరిగిన ప్రచారంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పాక్షిక విజయం సాధించడమే కాకుండా బీజేపీ పార్టీని ఓటమి అంచుల దాకా తీసుకెళ్లాయి అన్నది వాస్తవం. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోక తప్పదు. విచిత్రంగా ఈ అంశం ఎన్నికలతో మాత్రమే ఆగకుండా, ఎన్నికల తర్వాత కూడా పార్లమెంట్ వేదికగా చర్చనీయాంశం అయింది. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ చర్చ అంతటితో ఆగకుండా ఎన్నికల తర్వాత కూడా ఎన్నికైన పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకార సమయంలో సైతం రాజ్యాంగ రక్షణ అనే అంశం ప్రధాన భూమిక పోషించింది. ఇక ప్రతిపక్ష సభ్యులతో పాటు ఏకంగా రాహుల్ గాంధీ సైతం రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని ప్రమాణ స్వీకారం చేశారు. దానికి ప్రతిగా కాంగ్రెస్ పార్టీని దాని మిత్ర పక్ష సభ్యులను బీజేపీ సభ్యులు తమ మాటల తూటాలతో ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో విధించిన ఎమర్జెన్సీతో సహా జరిగిన ప్రతి పాత విషయాన్ని తూలనాడారు.

రాజ్యాంగాన్ని అవమానించడంతో పాటు రాజ్యాంగాన్ని రచించిన బాబా సాహెబ్ అంబేద్కర్ విషయంలో సైతం కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిన విషయాలను పార్లమెంట్ సాక్షిగా గుర్తు చేస్తూ ఎదురుదాడికి దిగారు. ఇదంతా పార్లమెంట్ వేదికగా జరుగుతున్న ఒక చర్చ. రాజ్యాంగం అంటేనే సామాజిక న్యాయం, కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించే ఒక వ్యవస్థ. ఇలాంటి అధికారిక వ్యవస్థను అసలు కొన్ని వర్గాల బాగు కోసమే పని చేసేట్టుగా, అది కూడా తమ ఆధిపత్య నాయకుల గుప్పిట్లో అచేతనా స్థితిలోకి నెట్టి నిర్వీర్యం చేయబడిందో ఒక్క సారి పరిశీలిద్దాం. డెబ్భై అయిదేళ్ల స్వాతంత్ర్య భారతదేశాన్ని ఎక్కువ కాలం పాటు పాలించిన చరిత్ర మన కాంగ్రెస్ పార్టీది. చరిత్ర లోతుల్లోకి వెళ్లి ఒక్కసారి కొన్ని చారిత్రక విషయాలను మనం అందరం స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రలోని కాంగ్రెస్ చర్యలను ఒక్కసారి మనం గమనిద్దాం .

బాబా సాహెబ్ Vs కాంగ్రెస్:
రాజ్యాంగ నిర్మాత అయిన బాబా సాహెబ్ అంబేద్కర్ ను చట్టసభల్లోకి రానివ్వకుండా ప్రతి చోట అడ్డుకున్న ఘణ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వైస్రాయ్ ప్రభుత్వంలో అత్యంత కీలక శాఖ అయిన శ్రామిక శాఖ మంత్రిగా పనిచేసి దేశంలో ఎన్నో వినూత్నమైన పారిశ్రామిక సంస్కరణలకు శ్రీకారం చుట్టగా, స్వతంత్ర భారత దేశంలో మొదటి చట్ట సభలోకి రానివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా నాటకీయంగా బెంగాల్ నుండి అవకాశం కల్పిస్తూ, అలా అవకాశం కల్పించిన ఖుల్నా నియోజకవర్గాన్ని దేశ విభజనలో భాగంగా ముస్లింలు 50% లేకున్నా కూడా అన్యాయంగా పాకిస్తాన్ లో కలిపారు. ఇదంతా అంబేద్కర్ ను రాజకీయంగా ఎదగనీయకుండా చేయడమనే కుట్రలో భాగమే. అందులో ప్రముఖ పాత్ర పోషించింది కూడా కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ మాత్రమే. నెహ్రూ నాయకత్వంలో ఏర్పడిన భారత మొదటి ప్రభుత్వంలో సైతం అంబేద్కర్ కు అన్యాయమే జరిగింది. అంతగా ప్రాధాన్యత లేనటువంటి న్యాయ శాఖను కట్టబెట్టి, ఎలాంటి పనిని అయినా అత్యంత ప్రతిభావంతంగా చెయ్యగల సమర్దత ఉన్న అంబేద్కర్ కు పని లేకుండా చేసి అవమానపరిచారు. చివరకు ఆయన రాజీనామా కూడా చేయాల్సిన పరిస్థితులను కల్పించిన ఘనత గాంధీ రాజకీయ కుటుంబ ఆద్యుడు నెహ్రూది. తన రాజీనామాకు దారి తీసిన పరిస్థితులను అప్పటి చట్టసభలో చెప్పుకునేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా చేసి అవమానపరిచిన సందర్భాన్నియావత్ భారతదేశం అప్పుడే చూసింది. తన రాజీనామా పత్రంలో అంబేద్కర్ ఈ విషయాన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో మళ్ళీ అంబేద్కర్ ను ఓటమిలో నెహ్రూ పాత్ర అంతా ఇంతా కాదు. నెహ్రూ వ్యక్తిగతంగా తీసుకోవడమే కాకుండా పార్టీ శ్రేణులను సైతం అంబేద్కర్ ఓటమిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరీ ఒక అనామకుడి చేతుల్లో ఘోర పరాజయం పాలయ్యేలా చేసాడు. వీటన్నింటిని క్లుప్తంగా అర్ధం చేసుకోవాలంటే అంబేద్కర్ రచించిన పుస్తకాలు, వ్యాసాలను చదవాల్సిందే. ముఖ్యంగా తాను రాసిన "What Congress and Gandhi Have Done to the Untouchables" అనే పుస్తకం బాబాసాహెబ్ ఒక బహుముఖ ప్రజ్ఞాశీలి గా, మేధావిగా రాజ్యాంగ నిర్మాతగా ఉండి కూడా స్వయంగా అనుభవించిన, చూసిన రాజకీయ వివక్షతను, నెహ్రూకుటుంబ కుటిల నీతిని మన కళ్ల ముందుంచుతుంది.

కాకా కాలేల్కర్ కమీషన్ -కాంగ్రెస్ పార్టీ:
రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం భారతదేశ భూభాగంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల స్థితిగతులు, వారు పడుతున్న ఇబ్బందులను పరిశోధించడానికి, తీసుకోవలసిన చర్యలకు సంబంధించి 'కాకా కాలేల్కర్ కమీషన్'ను భారత ప్రభుత్వం 1953లో జనవరి 29 న నియమించగా, 1955 మార్చ్ 30న తమ నివేదికను సమర్పించింది. తమ నివేదికలో సూచించిన కులాల వారీగా జనాభా లెక్కలు చేయాలి అనే సూచనను పట్టించుకున్న పాపాన పోలేదు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్ధిక, సామాజిక, విద్య, రాజకీయ తదితర రంగాల్లో ప్రాతినిధ్యం కరువైన వెనుకబడిన తరగతులు (బీసీ) వారికి వృత్తి విద్యా, ఉద్యోగాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కూడా సూచించింది. కుల వృత్తుల అభివృద్ధికి ప్రత్యేక ఆర్ధిక ప్రోత్సాహకాలు కల్పిస్తూ, ప్రభుత్వాలు పని చెయ్యాలి. స్థానిక పరిస్థితుల ఆధారంగా వెనుకబడిన తరగతులను గుర్తించే భాద్యత రాష్ట్రా లకు కల్పించాలని కూడా సూచించింది.

ఇందులో ఎలాంటి సూచనను కూడా పరిగణలోకి తీసుకోకుండా, రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేయబడిన కమిషన్ ఇచ్చిన నివేదికను తిరస్కరించింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పటినుండి 2018 లో ఏర్పడ్డ జాతీయ బీసీ కమిషన్ వరకు ఎన్నో సార్లు రాజ్యాంగాన్ని ఉల్లం ఘించే పనులే చేశాయి అప్పటి కేంద్ర ప్రభుత్వాలు. ప్రతిసారి తమ వాగ్ధానాలను మాటల మట్టుకే సరిపెట్టి, బీసీలకు తరతరాలుగా అన్యాయం చేశాయి. 1992 లో ఇంద్రా సాహ్నీ కేసులో భాగంగా, వెనుకబడిన తరగతుల కోసం ఒక శాశ్వత సంస్థను ఏర్పాటు చేయాలని ఏకంగా అప్పటి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా చట్టబద్దం చేయడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యింది.

అత్యవసర పరిస్థితులు - ఇందిరామార్క్ పాలన:
1975లో అకస్మాత్తుగా ఏకపక్షంగా దేశవ్యాప్తంగా ప్రకటించిన అత్యవసర పరిస్థితిలో ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్ట్ చేసి జైలుపాలు చేయడమే కాకుండా ఏకంగా 21 నెలలపాటు ఎదురులేని పాలన కొనసాగించింది ఇందిరాగాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ. అవన్నీ భారత దేశ చరిత్రలో చీకటి రోజులు. భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన సకల హక్కులను కాలరాసి చేసిన రాజరికపు నికృష్ట పాలన అది. తన రాజకీయ స్వలాభం కోసం వేలాది మంది ప్రతిపక్ష నాయకులను జైలుపాలు చేసి, తన ఇష్టారాజ్యంగా పాలించింది ఇందిరా గాంధీ.

ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మన చట్ట సభలు, కార్యనిర్వాహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, సమాచార వ్యవస్థలను తన గుప్పిట్లో ఉంచుకొని పాలించింది ఇందిరా గాంధీ. వార్తా పత్రికలను సైతం తమ అదుపులో ఉంచుకుని రాజ్యాంగ విలువలను మంటగలిపి, దాదాపు రెండేళ్ల పాటు రాజ్యాంగాన్ని అమలు కాకుండా చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.. ఆ సమయంలోనే భారత దేశ పౌరుల ప్రాథమిక హక్కులను సైతం విస్మరించి, విలువలు లేని పాలన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ ఘనకార్యం చేసినందుకేనేమో ఇందిరా గాంధీని ఐరన్ లేడీగా అభివర్ణించడం మొదలుపెట్టారు. ఇలాంటి దుర్మార్గకరమైన పనిని నిజమైన ఏ దేశభక్తుడు చేయడు, సమర్దిం చడు కూడా. ఆ సమయంలోనే కాంగ్రెసేతర నాయకులుగా ఎదుగుతున్న ములాయం సింగ్, లాల్ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, కరుణానిధి, స్టాలిన్ లాంటి ఎందరినో జైలు పాలు చేశారు. 1976లో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్ కూడా చేశారు.

భారత రత్న వివాదం:
ప్రతిష్టాత్మక భారతరత్న సాధారణంగా చనిపోయిన తర్వాత 1,2 సంవత్సరాలకు ఇస్తారు కానీ తాను బతికి ఉండగానే భారతరత్న తనకు తానే ప్రకటించుకున్న చరిత్ర ఇందిరా గాంధీది.. వారి కాంగ్రెస్ పార్టీది. మరి అలాంటి పార్టీ ప్రపంచం గర్వించదగ్గ జ్ఞాని అయినా అంబేద్కర్ కు భారత రత్న ప్రకటించడంలో ఎందుకు విఫలమైంది? 1990లో కాంగ్రెసేతర ప్రభుత్వం ప్రకటించే దాకా ఎందుకు ఆగాల్సి వచ్చింది? భారత రాజ్యాంగాన్ని రచించి, ఎన్నో అణగారిన కులాలు, జాతులు, వర్గాల ఆశాజ్యోతిగా పనిచేసి వారి కోసం విప్లవాత్మక పథకాల రూపకల్పన చేసిన అంబేద్కర్ గారి పట్ల ఇది కాదా వివక్షత? ఎక్కడ ఉంది మీకు రాజ్యాంగ నిర్మాత మీద చిత్తశుద్ధి? ఏది మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకర్థం? అంబేద్కర్ పేరు పలకడానికి కూడా మీకు ఎలాంటి అర్హత లేదు.

ఆర్టికల్ 356 వాడుక:
రాజ్యాంగ రక్షణ అంటూ ఒకవైపు 0 తెత్తుకొని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ గారు, ఒక్కసారి చరిత్ర పుటల్లో మరో అంశాన్ని కూడా గమనించాలి. ఏదైనా రాష్ట్రం లో శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు, పౌర ఆందోళనలు జరిగినపుడు రాష్ట్ర ప్రభుత్వం అదుపు చెయ్యలేకపోతే, దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడేందుకు 356 అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకొని, రాష్ట్ర పతి పాలనను విధించే అధికారం ఉంది. ఇలాంటి అత్యంత బలమైన ఆయుధాన్ని చివరి అస్త్రంగా మాత్రమే వాడాలని అందుకే దాన్ని లెటర్ గా ప్రస్తుతించారు బాబా సాహెబ్. ఇంత ప్రాముఖ్యత ఉన్న 356 అధికరణను ఇష్టా రాజ్యంగా వాడిన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. తమ రాజకీయ లాభాల కోసం ఇందిరా గాంధీ తానూ ప్రధానమంత్రిగా ఉన్న 15 ఏళ్ళ కాలంలో దాదాపు 30 సార్లు వాడి ప్రతిపక్షాలను ఒక ఆట ఆడుకుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ పక్కన ఉండి కాంగ్రెస్ కోసం పని చేస్తున్న ఎందరో నాయకులు అప్పటి ఆ చర్యల్లో బలి అయిన వారే.

ఇవన్నీ ఒక ఎత్తైతే, ఇక పార్టీకి సంబంధించిన పదవుల్లో, వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రభుత్వాల్లో సైతం సామాజిక న్యాయం అనే హక్కును ఉల్లంఘిస్తూ, రాజ్యాంగ విలువలను భ్రష్టు పట్టిం చారు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవిలో ఎందరు నెహ్రూ కుటుంబేతర వాళ్ళు ఉన్నారు? ఎన్నేళ్లు ఒక కుటుంబం మాత్రమే పాలిస్తుంది? భారత దేశాన్ని తరతరాలుగా పాలిస్తూ, ప్రజాస్వామ్య దేశంగా ఎలా చెపుతున్నారో ఆ పార్టీ అగ్ర నాయకత్వ మనస్సాక్షికే వదిలేస్తున్న. భారత రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం లాంటి ఎన్నో ప్రాథమిక హక్కులను కాల రాచిన ఘణ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీదే. ప్రస్తుతం రాజ్యాంగ రక్షణ పేరుతో మాట్లాడుతున్న వారిని చూస్తుంటే హంతకులే సంస్మరణ సభలు పెట్టినట్టు విడ్డూరంగా అనిపిస్తుంది.

ఇక రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 ఏళ్ళు పూర్తి చేసుకొని 75 వ వసంతంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తి ప్రతి ఇంటికి చేరేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక హక్కుల సంస్థలు, మేధావి వర్గం తదితర వర్గాలందరి మీద ఉంది. రాజ్యాంగం మీద పాఠశాల స్థాయిలో ఒక పాఠ్య అంశం తీసుకువచ్చి ప్రతి పౌరుడికి కనీస అవగాహన ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకురావాలి. దానితోపాటు, రాజ్యాంగం మీద ప్రజలకు, విద్యార్థులకు, యువతకు అవగాహన పెంచేందుకోసం, జాతీయ స్థాయి సదస్సులు, చర్చలు, సమావేశాలు పెట్టాలి, ప్రతి ఇంటికి రాజ్యాంగ ప్రతిని పంచిపెట్టాలి. ఇంతేకాకుండా, అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం, ఏదో ఒక పార్టీ అని కాకుండా, పాలనలో భాగస్వాములైన ప్రతి పార్టీ, ప్రతి రాజకీయ నాయకుడు కారకులే. కావున ప్రతి పార్టీ విధిగా వారి వారి పార్టీ మీటింగ్ లల్లో రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలి.

దేశ పౌర హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి భుజస్కంధాల మీద ఉంది. అది మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారా మాత్రమే సాధ్యం. అంబేద్కర్ ను గౌరవించడమంటే రాజ్యాంగాన్ని రవించడం, రాజ్యాంగాన్ని అంబేద్కర్ లను విడదీసి చూడలేము అనే సత్యాన్ని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ జీ ఇప్పటికైనా గ్రహించాలి.

రచయిత
Dr. Kiran Dasari Ph.D. (USA)
సామాజిక శాస్త్రవేత్త
+91 63018 49448

#constitution #rahul-gandhi #kiran-dasari #ambedkar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి