టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. 2014-2019 మధ్య కాలంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టుపై ఒక్కోరాజకీయపార్టీ ఒక్కోవిధంగా స్పందిస్తోంది. జనసేన పవన్ కల్యాణ్ చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా నాటకీయ పరిణామాల మధ్య విజయవాడకు వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు.
ఈ పరిణామాలన్నింటిపై బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని..ఎంతోమంది రాజకీయ నాయకులు అరెస్టు కావడం, విడుదల కావడం సహజమే అన్నారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓ ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేశారంటే...ఎంతో సాహసమైనదన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడ్డారంటే...అధికారపక్షం వద్ద బలమైన కీలకమైన ఆధారాలు ఉండి ఉండాలన్నారు.
ఇది కూడా చదవండి: 2 వేలు దాటిన మొరాకో భూకంపం మృతుల సంఖ్య, ఎటు చూసిన శవాల దిబ్బలే..!!
ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేసి...ఆపార్టీకి చెడ్డపేరు వచ్చేలా చేయరని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. బలమైన సాక్ష్యాధారాలు ఉంటేనే ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేసేందుకు సాహసం చేస్తారన్నారు. అయితే తనకు ఈ కేసు గురించి అవగాహన లేదని చెప్పిన రఘునందన్ రావు...ఇలాంటి సమయంలో అరెస్టు చేసిన ప్రతిపక్ష పార్టీకి మేలు చేయాలని ఏపాలక పక్షం అనుకోదని తెలిపారు.
ఇది కూడా చదవండి: చీరకట్టులో ఆశ్చర్యపరిచిన జపాన్ ప్రథమ మహిళ …!!