బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda)తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఆయన పూణె (Pune) లో ఓ వినాయక మండపాన్ని సందర్శించిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వినాయకుడిని దర్శించుకున్న నడ్డా హారతి ఇస్తుండగా మండపం గోపురం పై ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
దీంతో అప్రమత్తమైన నడ్డా భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ని అక్కడి నుంచి బయటకు తీసుకుని వచ్చారు. పూణెలోని సానే గురూజీ తరుణ్ మిత్ర బృందం ఉజ్జయినీ మహంకాళీ ఆలయం తరహాలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసింది. ఈ మండపాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు మంగళవారం సందర్శించారు.
అయితే జేపీ నడ్డా వచ్చారన్న ఆనందంతో కొందరు టపాకాయలు పేల్చారు. ఆ సమయంలో నిప్పు రవ్వలు మండపం గోపురాన్ని అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా గోపురం పై మంటలు అంటుకుని చెలరేగాయి. ప్రమాదం జరిగిన విషయం గురించి మండప సిబ్బంది అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేశారు. నడ్డాకి ప్రమాదం తప్పిందని తెలుసుకున్న రాజకీయ నాయకులు ఆయన్ని పరామర్శించడం మొదలు పెట్టారు.ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.