Bommarasipeta: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ ఎదురైంది. ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి వెళ్లిన మంత్రిని గ్రామస్తులు అడ్డుకున్నారు. పట్టాలు లబ్దిదారులకు కాకుండా తన అనుచరులకు ఇస్తున్నారని వారు ఆరోపించారు.

New Update
Bommarasipeta: మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పట మండల పరిధిలోని బొమ్మరాసిపేటలో లబ్ది దారులకు ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతున్న సమయంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఉన్న 380 మంది లబ్దిదారులకు ఒకే సారి పట్టాలు ఇస్తానని చెప్పి.. ఇప్పుడు విడతల వారీగా ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. దీంతో కోపంతో ఊగిపోయిన మల్లారెడ్డి అది అడగడానికి మీరెవరని గ్రామస్తులపై ఫైర్‌ అయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. గ్రామస్తులు మల్లారెడ్డి గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.

మరోవైపు గ్రామస్తులకు కాంగ్రెస్‌ నేత హరివర్ధన్ రెడ్డి మద్దతు తెలిపారు. 2009వ సంవత్సరంలో కాంగ్రెస్‌ హయాంలో బొమ్మరాసిపేటలో 200 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్న ఆయన.. ప్రస్తుతం మంత్రి మల్లారెడ్డి అవే పట్టాలు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. అవి కూడా అర్హులైన వారికి కాకుండా తన అనుచరులకు అందజేయాలని మంత్రి మల్లారెడ్డి కుట్ర పన్నారని ఆయన మండిపడ్డారు. జిల్లాలో మంత్రి మల్లారెడ్డి డబుల్‌ బెడ్‌ రూమ్‌, గృహలక్ష్మి, దళితబంధు, కళ్యాణ లక్ష్మి పథకాలను తన అనుచరులకే అందజేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా హరివర్ధన్ రెడ్డి తన అనుచరులతో రోడ్డుపై బైటాయించే ప్రయత్నం చేయగా అడ్డుకున్న పోలీసులు అయన్ను అరెస్ట్‌ చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

చివరకు దీనిపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి 380 మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తానని హామి ఇవ్వడంతో గొడవ సర్దు మనిగింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్‌ వన్‌గా నిలిపిందన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాలకు చెందిన వారిని ఆదుకుంటున్నారని, అందరిని డెవలప్‌మెంట్‌ చేయడమే సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పరిశ్రమల అడ్డాగా హైదరాబాద్‌ నిలిచిందన్నారు. దీంతో హైదరాబాద్‌ విశ్వ నగరంగా నిలిచిందని మంత్రి గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు పట్టించుకోవద్దని మంత్రి సూచించారు.

Advertisment
తాజా కథనాలు