Jaya Shankar: స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త.. ప్రొఫెసర్ జయశంకర్‌ జయంతి నేడు!

తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ 90వ జయంతి నేడు. తెలంగాణ ఉద్యమానికే జీవితం అంకితం చేసిన ఆయన సేవలను స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుతున్నారు. సీఎం రేవంత్, కేటీఆర్, ప్రముఖులు ఆయన కృషి, త్యాగాన్ని స్మరించుకుంటూ నివాళి అర్పించారు.

New Update
Jaya Shankar: స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త.. ప్రొఫెసర్ జయశంకర్‌ జయంతి నేడు!

Professor Jayashankar Jayanti: తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడు, సిద్ధాంతకర్త, ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాంతం గడిపిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ 90వ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు చోట్ల ఆయన విగ్రహాలను ఆవిష్కరించి ఆయన సేవలను సీఎం గుర్తుచేసుకుంటున్నారు తెలంగాణ ప్రజలు, మేధావులు. అంతేకాదు జయశంకర్ సారు పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని, ఆయన కలలుగన్న తెలంగాణ నిర్మితమయ్యే దిశగా ముందుకెళ్లాలని పిలుపునిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమానికే జీవితాన్ని అంకితం చేసి..
తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ 1934 ఆగష్టు 6న హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు జయశంకర్. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011 జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. జయశంకర్ జ్ఞాపకార్థం జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేశారు.

ఉద్యమ స్ఫూర్తిని కొన‌సాగిస్తాం.. సీఎం రేవంత్
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. జయశంకర్‌ సారు కృషిని, త్యాగాన్ని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 'ఉచ్ఛ్వాస నుండి.. నిశ్వాస వరకు. ఆయన నరనరాన ప్రవహించిన ప్రాణం తెలంగాణ. ప్రొఫెసర్ జయ శంకర్ సారు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను' అంటూ పోస్టులో రాసుకొచ్చారు. అలాగే ప్రత్యేక రాష్ట్ర సాధ‌నే ధ్యేయంగా జీవిత ప‌ర్యంతం గ‌డిపిన జ‌య‌శంక‌రు సారును తెలంగాణ స‌మాజం స‌దా గుర్తుంచుకుంటుంద‌న్నారు. జ‌య‌శంక‌ర్ ఉద్యమ స్ఫూర్తిని కొన‌సాగిస్తామ‌ని ఆయ‌న ఆశ‌య సాధ‌న‌కు కోసం ప్రభుత్వం పూర్తిగా క‌ట్టుబ‌డి ఉంటుంద‌ని తెలిపారు.

ఇది కూడా చదవండి: Gaddar Death Anniversary : గద్దరన్న యాదిలో.. పాటలతో అభిమానుల ఘన నివాళి!

ఆయన కృషి అనిర్వచనీయం.. కేటీఆర్
ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జయశంకరు సారుకు నివాళి అర్పిస్తూ ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. 'పుట్టుక మీది.. చావు మీది.. బ్రతుకంతా తెలంగాణది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం. స్వరాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమైనది. వారి స్ఫూర్తి మరిచిపోలేనిది. సార్ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం.. తెలంగాణ ప్రగతి ప్రస్థానం. జోహార్ జయశంకర్ సార్!' అంటూ రాసుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు