ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1వ తేదీన మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పుణే నగరంలోని దగదుషేత్ లోని వినాయకు ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడ మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జరిగే కార్యక్రమంలో మోదీ లోకమాన్య తిలక్ జాతీయ అవార్డును స్వీకరిస్తారు. ఈపర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు మెట్రో రైళ్లను కూడా ప్రారంభించనున్నట్లు పీఎంవో తెలిపింది. పుణే మెట్రో ఫేజ్ 1 రెండు కారిడార్ లలో రెండు సెక్షన్ లలో సేవలను ప్రారంభించనున్నారు. ఈ విభాగాలు ఫుగేవాడి స్టేషన్ నుంచి సివిల్ కోర్టు స్టేషన్ వరకు, గార్వేర్ కాలేజ్ స్టేషన్ నుంచి రూబీ హాల్ క్లినిక్ వరకు ఉన్నాయి.
కొత్త విభాగాలు పూణే నగరంలోని శివాజీ నగర్, సివిల్ కోర్టు, పూణే మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, పూణే ఆర్టీవో , పూణే రైల్వే స్టేషన్ వంటి ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతాయి. సివిల్ కోర్టు మెట్రో స్టేషన్ దేశంలోని లోతైన మెట్రో స్టేషన్లలో ఒకటి. దీని లోతు 33.1మీటర్లు ఉంది. ఫ్లాట్ ఫారమ్ పై నేరుగా సూర్యరశ్మి పడే విధంగా స్టేషన్ పైకప్పును తయారు చేశారు. దేశవ్యాప్తంగా ఆధునిక, పర్యావరణ అనుకూలమైన, సామూహిక వేగవంతమైన పట్టణ రవాణా వ్యవస్థలను పౌరులకు అందించాలనే ప్రధాని దృష్టిని సాకారం చేయంలో ఈ ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన ముందడుగు అని ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ప్రకటనలో తెలిపింది.
దాదాపు రూ. 300కోట్లతో అభివృద్ధి చేసిన పింప్రి చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) ఆధ్వర్యంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను ప్రధాని ప్రారంభిస్తారు . ఇది విద్యుత్ ఉత్పత్తికి ఏటా దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను వినియోగిస్తుంది. పిసిఎంసి ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 1,280 కంటే ఎక్కువ ఇళ్లను కూడా ప్రధాని అందజేయనున్నారు. పూణే మునిసిపల్ కార్పొరేషన్ నిర్మించిన 2,650 కంటే ఎక్కువ PMAY ఇళ్లను కూడా ఆయన అందజేయనున్నారు. ఇంకా, పీసీఎంసీ ద్వారా నిర్మించనున్న సుమారు 1,190 PMAY ఇళ్లకు, పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా నిర్మించబడిన 6,400 ఇళ్లకు కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే పలు డెవలప్ మెంట్ కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు పీఎంవో పేర్కొంది.
ఇక భారత స్వాతంత్ర్య సమరయోధులు లోకమాన్య బాలగంగాధర తిలక్ వర్ధంతి సందర్భంగా ప్రతిఏటా ఆగస్టు 1న జరిగే కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు లోకమాన్య జాతీయ అవార్డును తిలక్ స్మారక మందిర్ ట్రస్టు ప్రదానం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా దేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు అవార్డును అందిస్తారు. గతంలో డాక్టర్ శంకర్ దయాల్ శర్మ, ప్రణబ్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజ్ పేయి, ఇందిరాగాంధీ వంటి దిగ్గజాలకు ఈ అవార్డును అందజేశారు. ఈ జాబితాలో ప్రధానమంత్రి మోదీ 41 వ్యక్తి.