CS Santhi Kumari : తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు కోసం రేవంత్(Revanth) సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఆరు హామీల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను విడుదల చేసి...డిసెంబర్ 28 నుంచి జనవరి 6లోపు ఇవ్వాలని చెప్పింది. ఈ దరఖాస్తుల గడువు రేపటితో ముగియనుంది. యువత అభివృద్ధి తప్ప మిగిలిన హామీల కోసం గ్రామాల్లో గ్రామసభలు, పట్టణాల్లో వార్డుల్లో ప్రత్యేక సభలు నిర్వహించి ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దరఖాస్తులను ఇచ్చారు. కానీ ఇంకా చాలా మంది ఇవ్వాల్సి ఉంది. రేపటితో గడువు ముగియనుండడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. రేపటిలోపు ఇవ్వలేకపోతే తమకు ఎక్కడ హామీలు అందకుండా పోతాయో అని దిగులు చెందుతున్నారు.
ఆందోళన వద్దు..
అయితే దరఖాస్తుదారులు ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తెలంగాణ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణకు 6వ తేదీ తర్వాత గడువు పొడిగించే అవకాశం లేదని... కానీ మరో నాలుగు నెలల తర్వాత ప్రజాపాలన ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని సీఎస్ శాంతికుమారి తెలిపారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక ప్రజాపరిపాలన సమావేశాలు నిర్వహించి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని సీఎస్ చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రజలు ఆందోళన చెందవద్దని శాంతి కుమారి భరోసా ఇచ్చారు.
Also read : భారత్ న్యాయ్ యాత్రకు ముందే అభ్యర్థుల ప్రకటన..సీడబ్ల్యూసీ కీలక నిర్ణయం
17లోగా డేటా ఎంట్రీ పూర్తి..
మరోవైపు తెలంగాణ(Telangana) లో అభయ హస్తం, ప్రజాపాలన(Praja Palana) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తోంది రేవంత్ ప్రభుత్వం. అందుకు తగ్గట్టే జిల్లా కలెక్టర్లకు, అదికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తు ఫామ్‌లను తీసుకుంటారు. దీని తర్వాత వీటి డేటా ఎంట్రీ ని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Santhi Kumari) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 17లోగా మొత్తం డేటా ఎంట్రీ అయిపోవాలని చెప్పారు. 6వ తేదీన ప్రజావాణి ముగిసిన వెంటనే దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచించారు. మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు.
రేషన్ కార్డు, ఆధార్ ప్రామాణికం:
డేటా ఎంట్రీ కోసం 4, 5 తేదీల్లో అధికారులకు, కలెక్టర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. బీమా దరఖాస్తుల డేటా ఎంట్రీ(Data Entry) ని 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పూర్తి చేయాలి. డేటా ఎంట్రీలో ఆధార్ నంబర్, తెల్ల రేషన్ కార్డు(Ration Cards) ను ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ పనుల్ని సక్రమంగా జరగడానికి డీటీపీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని… అవసరమైతే ప్రైవేట్ ఆపరేటర్లను నియమించుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. ఈ మొత్తం పనిని ప్రజా పరిపాలన కార్యక్రమానికి పర్యవేక్షక అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు.