Bhishm Hospital : మరో రెండు రోజుల్లో అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అయోధ్య(Ayodhya) లో మొత్తం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది రామభక్తులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోదీ తో సహా దాదాపు 7 వేల మందికి పైగా సిని, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాల ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. మరోవైపు అయోధ్యలో ఇప్పటికే భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు.
భీష్మ్
ఓవైపు ప్రాణ ప్రతిష్ఠ వేడుక కోసం ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతుండగా.. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించడానికి భీష్మ్(Bhishm) అనే విపత్తుల చిరు ఆస్పత్రిని అందుబాటులో ఉంచనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం ప్రకటన చేసింది. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా రూపొందించిన ఈ భీష్మ్ ఆసుపత్రి ఘనాకారంలో ఉంటుంది.
Also Read: అయోధ్య బాల రాముని విగ్రహం చుట్టూ దశావతారాలు!
అత్యాధునిక పరికరాలు
అత్యవసర సమయాల్లో(Emergency) ప్రజలకు వేగంగా వైద్యం అందించడానికి ఇందులో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంటాయి. కృత్రిమ మేధ, అంతర్జాల సాంకేతికత సాయంతో ఈ చిన్న ఆసుపత్రి అనేక సేవలను అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. ఎవరికైన ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్లకి ఈ భీష్మ్ ఆసుపత్రి(Bhishm Hospital) ద్వారా త్వరగా ట్రీట్‌మెంట్ అందడంతో వారిని రక్షించేందుకు ఎంతగానో వీలు ఉంటుంది.
ఫొటోలు వైరల్
ఇదిలా ఉండగా.. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కు ముందుగానే గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడి విగ్రహం ఫొటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 51 అంగుళాల పొడవైన ఈ విగ్రహాన్ని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి రూపొందించారు. ఆలయ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో అన్ని దారులు అయోధ్య వైపే ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు మతాలకు అతీతంగా అయోధ్య చేరుకొనేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం రోజున పలు రాష్ట్రాలు ఆ రోజును సెలవు దినంగా కూడా ప్రకటించాయి.
Also Read: పిల్లల పోషణ బాధ్యత తండ్రిదే..హైకోర్టు సంచలన తీర్పు..!!