సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే బరిలో ఉంటాడని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వామపక్షాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. పార్టీ అధిష్టానంతో సీపీఐ చర్చలు జరుపుతుందని తెలియడంతో హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారన్నారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడినట్లు మాజీ ఎంపీ తెలిపారు. వారికి భరోసా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు గురికావొద్దని నియోజకవర్గంలో ఎవరికి విజయ అవకాశాలు ఎక్కవగా ఉంటే వారికే టికెట్ ఇస్తారన్నారు. ప్రస్తుతం సీపీఐ కంటే కాంగ్రెస్ అభ్యర్థికే విజయ అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా హుస్నాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజల ఆకాంక్ష మేరకు ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు.మరోవైపు బీఆర్ఎస్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ అసమర్ధత వల్లే గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందని విమర్శించారు. ఎమ్మెల్యే సతీష్ హుస్నాబాద్ ప్రజలు ఆకాంక్షించిన విధంగా అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.
మరోవైపు తాను ఎంపీగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి ఎలా జరిగిందో చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే ఏ విధంగా అభివృద్ధి చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. హుస్నాబాద్‌లో పర్యాటక, పారిశ్రామిక రంగం, నిరుద్యోగ సమస్యలను ఎమ్మెల్యే తీర్చాడా అని మాజీ ఎంపీ ప్రశ్నించారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధిపై చర్చకు రావాలని ఎంపీ బండి సంజయ్‌ని, వినోద్ కుమార్‌ని ఎన్నోసార్లు అహ్వానించానని గుర్తు చేశారు.