Sunil Kanugolu: కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ కనుగోలు.. ఆయన దిమ్మదిరిగే వ్యూహాలు ఇవే!

తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు వెనుక ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నారు. సునీల్‌ టీమ్‌ సోషల్‌మీడియా క్యాంపెయినింగ్‌, నినాదాలు, కన్‌విన్సింగ్‌ ఫార్ములా, టికెట్ల కేటాయింపు.. ఇలా ప్రతీవిషయంలోనూ సునీల్ కనుగోలు టీమ్‌ కీలకంగా వ్యవహరించి కాంగ్రెస్ ను వరుస ఓటముల నుంచి విజయ తీరానికి చేర్చింది.

New Update
Sunil Kanugolu: కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ కనుగోలు.. ఆయన దిమ్మదిరిగే వ్యూహాలు ఇవే!

రాజకీయమంటేనే చదరంగం! ఎత్తుకు పైఎత్తులు వేయడం.. బరిలో ఉన్న అస్త్రాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడం రాజకీయ వ్యుహకర్తల నైజం. మోదీ నుంచి సోనియా వరకు ఇప్పుడు ప్రతీ రాజకీయ నేత పోల్‌ స్ట్రాటజీస్ట్‌లనే నమ్ముకునే పరిస్థితి వచ్చిందని ప్రత్యేకంగా చెప్సాల్సిన పనిలేదు. ఏ ఎలక్షన్‌లోనైనా పార్టీ గెలుపునకు వెనుక ఉంటున్నది ఎన్నికల వ్యూహకర్తలే. 'బాయ్ బాయ్‌ బాబు' అయినా 'అబాకీ బార్‌ మోదీ సర్కార్‌' అయినా 'రావాలి జగన్‌-కావాలి జగన్‌' అయినా ప్రస్తుతం తెలంగాణలో దుమ్ములేపిన 'మార్పు కావాలి-కాంగ్రెస్‌ రావాలి' అయినా అది ఎన్నికల వ్యూహకర్తల బ్రెయిన్‌ నుంచి బయటపడిన నినాదమే కావొచ్చు. లేదా వారి టీమ్‌ది కావొచ్చు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరుగులేని ఆధిపత్యంతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌)ని ఓడించిన కాంగ్రెస్‌ విజయం వెనుక ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు(Sunil Kanugolu) ఉన్నారు. ఆయన వ్యూహ, ప్రతివ్యూహాలతో కాంగ్రెస్‌ తిరుగులేని విజయం సాధించింది. ఇంతకీ సునీల్ కనుగోలు ఏం చేశారు? ఆయన వ్యూహాలు కాంగ్రెస్‌ను ఎలా గెలిపించాయి?

ఈ ఏడాది రెండో సూపర్ హిట్:
మోదీ, మమత లాంటి వారికి బంపర్‌ విక్టరీలు అందించిన క్రెడిట్లు సొంతం చేసుకున్న ప్రముఖ పోల్‌ స్ట్రాటజిస్ట్‌ ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌లో పని చేసిన సునీల్ కనుగోలు ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది కంట్రీగా మారారు. ఈ ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ వ్యూహకర్త ఆయనే. అంటే ఈ ఏడాది ఆయనకు ఇది రెండో విజయం. రాహుల్‌ గాంధీ జోడోయాత్ర సక్సెస్‌లోనూ ఆయన పాత్ర ఉందన్నది కాంగ్రెస్‌ వర్గాల మాట. ఇలా సక్సెస్‌తో దూసుకుపోతున్న సునీల్ కనుగోలు తెలంగాణలోనూ తానెంటో నిరూపించుకున్నాడు.

తెలంగాణలో కనుగోలు ఏం చేశారంటే?

--> కర్ణాటక తరహాలోనే ఇక్కడ కూడా హామీలు: కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపునకు ఐదు గ్యారెంటీల ప్రచారం ఎలా పని చేసిందో అందరికి తెలుసు.. అదే ఫార్ములాను ఇక్కడ కూడా అమలు చేశారు సునీల్ కనుగోలు.. కాంగ్రెస్‌ గెలిస్తే ఆరు గ్యారెంటీలు ఇస్తామంటూ హస్తం నేతలు ఊరూరా తిరిగారు.

--> బీజేపీ-బీఆర్‌ఎస్‌ ఒకటేనన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్లడం: నిజానికి కర్ణాటక ఎన్నికల రిజల్ట్ ముందువరకు ఓటర్లంతా బీఆర్‌ఎస్‌కు పోటినిచ్చే పార్టీ బీజేపీనేననుకున్నారు. కానీ తర్వాత సీన్‌ మొత్తం మారిపోయింది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను ఆ పదవి నుంచి పక్కన పెట్టిన కమలం పార్టీ ఆ పగ్గాలను కిషన్‌రెడ్డికి అప్పగించింది. నిజానికి బండి సంజయ్‌ పనితనం మీద బీజేపీకి ఎలాంటి సమస్యాలేదు. కేసీఆర్‌పై వణుకు, బెణుకు లేకుండా బహిరంగా విమర్శలు చేసే అతికొద్ది మంది నాయకుల్లో బండి ఒకరు. ఆయన్ను పక్కనపెట్టడంతో ఇదంతా బీజేపీ కేసీఆర్‌ కోసమే చేసిందన్న ప్రచారాన్ని కాంగ్రెస్‌ ప్రజల్లోకీ తీసుకెళ్లింది. బీఆర్‌ఎస్‌-బీజేపీ ఒకటేనన్న భావనను హస్తం నేతలు ప్రచారం చేయడం వెనుక సునీల్ కనుగోలు ఉన్నారని టాక్.

--> టికెట్ల కేటాయింపు: టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్‌ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించేలా చేశారు సునీల్ కనుగోలు. అనేక సర్వేలు చేయడం, ఎప్పటికప్పుడు రిపోర్ట్స్‌ తెచ్చుకుని పరిశీలించడం తర్వాత నిర్ణయం తీసుకోవడం సునీల్ కనుగోలు టీమ్‌ విజయానికి మరో కారణం. ఉదాహరణకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్‌ టికెట్‌ మందుల సామేలుకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. నిజానికి సామేలుకు బీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ఇక తుంగతుర్తి టికెట్‌ కోసం అద్దంది దయాకర్‌ తీవ్రంగా పోటి పడ్డారు. అయితే ఇక్కడి నుంచే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దమోదర్‌రెడ్డికి, అక్కడ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అద్దంకి దయాకర్‌ వ్యతిరేకమన్న ప్రచారం ఉంది. ఇక గత రెండు సార్లు కూడా స్వల్ప ఓట్లతో దయాకర్ ఓడిపోయారు. దీంతో తెలివిగా వ్యవహరించిన కాంగ్రెస్‌ సామేలుకు టికెట్‌ ఇచ్చింది. చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న సామేలు గెలుస్తాడా అని అంతా అనుకున్నారు. కానీ రిజల్ట్‌ వచ్చిన తర్వాత చూస్తే సామేలు 50వేలకు పైగా ఓట్ల మెజార్టీతో తిరుగలేని విజయం సాధించారు. తుంగతుర్తిలో ఇదే ఇప్పటివరకు భారీ మెజారిటీ గెలుపు. బీఆర్‌ఎస్‌లో ఆయనకున్న పరిచయాలు, ఉద్యమ నేపథ్యం ఆయనకు గెలుపుకు కారణం అవుతాయన్న విషయాన్ని సునీల్ కనుగోలు టీమ్‌ ముందే గ్రహించే ఆయనకు టికెట్ దక్కేలా చేయడంతోనే ఇది సాధ్యమైందని కాంగ్రెస్ లో చర్చ సాగుతోంది.

--> కన్‌విన్సింగ్‌ ఫార్ములా: 'నిన్నగాక మొన్న వచ్చాడు..వీడు చెప్పేందెంట్రా' అన్న భావన రాజకీయాల్లో చాలామంది సీనియర్‌ నేతలో ఉంటుంది. కాంగ్రెస్‌లో కాస్త ఎక్కువే ఉంటుంది. అయితే సునీల్‌ కనుగోలుకు మాత్రం తెలంగాణ కాంగ్రెస్‌ పూర్తిగా సహకరించింది. అలా సహకరించేలా అందరిని కన్‌వీన్స్‌ చేసుకోగలిగాడు సునీల్. ఆయన చెప్పింది వింటే గెలుస్తామన్న భావన దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయుకుల్లో కూడా వచ్చిందంటే ఆయన స్ట్రాటజీలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.

--> చేరికలు: ఎన్నికలకు 2-3 నెలల ముందు తెలంగాణ కాంగ్రెస్‌లో భారీ చేరికలు జరిగాయి. ఇక చివరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లాంటి సీనియర్లు తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరడం వెనుక కూడా సునీల్ కనుగోలు పాత్ర ఉంది. వివేక్‌ వెంకట్‌స్వామి, రాజగోపాల్‌రెడ్డి లాంటి నేతలకు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తే గెలవొచ్చన్న ధీమా కల్పించింది ఈ పోల్‌ స్ట్రాటజీస్టే అని గాంధీ భవన్ లో జోరుగా చర్చ సాగుతోంది.

--> పొత్తు: ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఎం మధ్య పొత్తు లేదు. కాంగ్రెస్‌-సీపీఐ మధ్య పొత్తు ఉంది. సీపీఎం ఎక్కువ స్థానాలు అడగడంతో ఈ పొత్తు ముందుకు వెళ్లలేదు. సీపీఎం అడిగినట్లు కాంగ్రెస్‌ సీట్లు ఇవ్వనని తెగెసి చెప్పింది. ఇది కాంగ్రెస్‌కు కలిసి వచ్చింది. అటు సీపీఐకి పొత్తులో భాగంగా 5 వరకు సీట్లు అడిగినా.. కాంగ్రెస్‌ ఒకే ఒక సీటును ఇచ్చింది.  ఆ సీటును కూడా గెలిపించుకుంది. ఒకవేళ సీపీఎం, సీపీఐ అడిగినన్ని సీట్లు ఇచ్చి.. వాళ్లు ఓడిపోయి ఉంటే కాంగ్రెస్‌ అసలు ప్రభుత్వం ఏర్పాటు చేసేదానన్న అనుమానం ఇప్పడు అందరిలోనూ వ్యక్తం అవుతోంది. సీపీఎం, సీపీఐ ఇద్దరు కలిపి మొదట దాదాపు 10 సీట్ల వరకు అడిగినట్లు సమాచారం. 119 నియోజకవర్గాలున్న తెలంగాణలో మ్యాజిక్ ఫీగర్‌ 60. కాంగ్రెస్‌ గెలిచిన సీట్లు 64. అలా 2018లో మధ్యప్రదేశ్‌లో ఎడ్జ్‌లో గెలిచిన కాంగ్రెస్‌ రెండేళ్లకే అధికారాన్ని కోల్పోయింది. సూట్‌కేసులు, హార్స్ ట్రేడింగ్‌లకు కొన్ని పార్టీలు పెట్టింది పేరన్న విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పొత్తు విషయంలోనూ సునీల్‌ కనుగోలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించడంతోనే కాంగ్రెస్ కంఫర్టబుల్ మెజార్టీ సాధించిందన్న చర్చ ఉంది.

ఇలా తెలంగాణలో కాంగ్రెస్‌లో గెలుపునకు సునీల్ టీమ్‌ రచించిన వ్యూహాలు ఎన్నో ఉన్నాయి. నేరుగా అభ్యర్థులతోనే మాట్లాడడం, సలహాలు ఇవ్వడంతో పాటు నినాదాలు, సోషల్‌మీడియా క్యాంపెయినింగ్‌, కాంగ్రెస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

Also Read: పడి లేచిన కెరటం రేవంత్‌రెడ్డి.. ఆయన జీవితం పోరాటాల పాఠం!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు