/rtv/media/media_files/2025/06/25/telangana-local-elections-2025-06-25-12-57-03.jpg)
TG News: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారింది. ఎవరికి ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలనే దానిపై అయోమయం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉత్కంఠ రేపుతోంది.
ఆమోదం పొందండం ప్రశ్నార్థకమే..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న ఇప్పటికే హామీ ఇవ్వగా.. న్యాయ పరిమితులు ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. 90 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఇదే సమయంలో రిజర్వేషన్లను ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్రం నెల రోజుల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించడం అసాధ్యమేని అర్థమవుతోంది. జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలుకానుండగా రిజర్వేషన్ల ఖరారు జూలై 24 వరకే పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా బిల్లు ఆమోదం పొందండం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.
ఇది కూడా చూడండి:Sexual Harassment : ప్లీజ్ వీడియో కాల్ లో మాట్లాడు.. ఓ చీఫ్ ఇంజినీర్ ఛీప్ ప్రవర్తన..సీతక్క ఫైర్
ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో జారీ చేయాలని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే జీవో ఇస్తే చెల్లుబాటు అవుతుందా? న్యాయపరమైన చిక్కులేమైనా వస్తాయా? అనే అంశాలపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోంది. ఒకవేళ ఈ జీవో అమలు చేయలేకపోతే ఇప్పటిదాకా ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది. రిజర్వేషన్ల ప్రక్రియ వారంలోపే ప్రారంభిస్తేనే నెల రోజుల్లో పూర్తి చేయాలనే హైకోర్టు తీర్పును అమలు చేసే ఛాన్స్ ఉంది.
ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలవుతుండగా బీసీలకు 23 శాతం కేటాయిస్తున్నారు. 2018లో గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేయగా బీసీ రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గించింది. ఆ విధానంలోనే 2019లో స్థానిక ఎన్నికలను నిర్వహించింది. దీంతో బీసీలకు రిజర్వేషన్లను తగ్గించడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రాల విచక్షణ మేరకు 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి మించకుండా కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను నియమించింది. కుల సర్వేలో రాష్ట్రంలో బీసీల జనాభా 56.33 (ఓసీ ముస్లింలు, బీసీ ముస్లింలు) ఉన్నట్లు వెల్లడించింది. దీంతో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల సిఫారసులను ప్రత్యేక కమిషన్ 6 కేటగిరీలుగా విభజించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వార్డు సభ్యులు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్.. ఇలా 6 ర కాల నివేదికలను తయారు చేసింది. ఆయా పదవుల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల వివరాలను నివేదికలో పేర్కొంది. అయితే ఓవైపు రిజర్వేషన్లు 50కు మించకూడదనే సుప్రీం తీర్పు, మరోవైపు సెప్టెంబరు 30లోపు స్థానిక ఎన్నికలు ముగించాలనే హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం అతలాకుతలమవుతున్నట్లు సమాచారం.