Imran Khan : పాకిస్థాన్(Pakistan) లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో(General Elections) ఏ పార్టీకి కూడా మెజార్టీ రాలేదన్న సంగతి తెలిసిందే. ఓవైపు పీఎంఎల్-ఎన్ అధినేత నవాజ్ షరీఫ్(Nawaz Sharif) సంకీర్ణ ప్రభుత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే ప్రధానిగా తన సోదరుడు షహబాజ్ షరీఫ్ పేరును ప్రతిపాదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మద్దతుదారులు కూడా తాము ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధమని ప్రకటించారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు.
Also Read : లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీదే హవా.. పీపుల్స్ పల్స్ – సౌత్‌ఫస్ట్ సర్వే ఇదే..
స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి
పాకిస్థాన్ ముస్లీం లీగ్-నవాజ్(PML-N) పార్టీకి మెజార్టీ లేకున్నా కూడా.. మిత్రపక్షం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(PPP) తో.. సహా మరికొన్ని చిన్న చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు.. స్వతంత్ర అభ్యర్థుగా పోటీ అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. ఆ పార్టీ గుర్తును ఎన్నికల సంఘం.. ఎన్నికలకు ముందు రద్దు చేయడంతోనే.. ఆ పార్టీ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా పీఎంఎల్-ఎన్ పార్టీ కంటే ఇమ్రాన్ మద్దతుదారులే ఎక్కవ స్థానాల్లో గెలిచారు.
ఆ పార్టీలో చేరుతాం
ఎన్నికల్లో గెలుపొందిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రతిపక్ష పాత్రకే పరిమితమవుతారనే చర్చలు ఇదివరకు నడిచాయి. అక్కడి నిబంధనల ప్రకారం.. ఎన్నికల్లో నెగ్గిన ఒక పార్టీకి గెలిచిన స్థానాల సంఖ్యకు అనుగుణంగా రిజర్వ్‌డ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఖాన్ మద్దతుదారులు ఇండిపెండెంట్ అభ్యర్థులు కావడం వల్ల ఆ వర్గానికి ఈ రిజర్వ్‌డ్ సీట్లు దక్కవు. ఇందుకోసం వాళ్లు ఒక పార్టీగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. పాకిస్థాన్‌లో ఇస్లామిక్ 'ఇస్లామిక్ పొలిటికల్ అండ్ రెలిజియస్ పార్టీస్ గ్రూప్’లోని ఓ చిన్న పార్టీ అయిన సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్(SIC) లోకి చేరేందుకు ఖాన్ మద్దతుదారులందరూ సిద్ధం అయ్యారు. అయితే SIC పార్టీ తరఫున ఆ పార్టీ చైర్మన్ సయ్యద్ మహ్‌పూజ్ మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ పార్టీలో చేరి.. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని PTI పార్టీ ప్రణాళిక చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఓటమి తర్వాత తొలిసారిగా ఢిల్లీకి కేసీఆర్.. కారణం అదేనా..
ఇమ్రాన్ ఖాన్ పీఎం అయ్యే ఛాన్స్
ఒకవేళ ఈ కూటమికి అనుమతి వస్తే.. పాక్‌లోని వివిధ ప్రావిన్స్‌లోనే కాదు.. కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా పీటీఐకి వస్తుందని.. పీటీఐ తరఫున ప్రధాన అభ్యర్థి అయూబ్ ఖాన్ తెలిపారు. మా సభ్యలందరం కూడా సున్నీ ఇత్తేహద్ కౌన్సిల్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి చర్చలు కూడా సఫలమ్యాయని.. మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా లేకపోలేదని పీటీఐ చైర్మన్ గోహర్ అలీఖాన్ అన్నారు. అయితే ఈ వారంలోనే SIC లో చేరేందుకు దరఖాస్తులను పాక్ ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ ఈ కూటమికి ఎన్నికల సంఘం ఒప్పుకుంటే.. పాక్ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి.