భారత్‌లో జరిగే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనేందుకు దాయాది పాక్ టీమ్ భారత్ చేరుకుంది. ఇటీవల పాక్ ఆటగాళ్లకు వీసాలు రాకపోవడంతో పాక్ ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా దీనిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐతో చర్చలు జరపడంతో బీసీసీఐ ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర హోం శాఖ భారత్‌కు వచ్చే పాక్ ఆటగాళ్లకు వీసీలు మంజూరు చేసింది.
దీంతో పాక్ నుంచి 18 మంది ప్లేయర్లు, 13 మంది సిబ్బంది మొత్తం 31 మంది లాహోర్ నుంచి దుబాయ్ అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా పాకిస్థాన్ టీమ్ న్యూజిలాండ్ జట్టుతో ఈ నెల 29న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు హైదరాబాద్‌కు రావడంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది పాక్ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ నుంచి ఉప్పల్ స్టేడియం వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది.
పాక్ టీమ్ తమ హోటల్ నుంచి ఉప్పల్ స్టేడియానికి వచ్చే సమయంలో పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. పాక్ టీమ్ ఇక్కడ ఈ నెల చివరి వరకు మాత్రమే ఉండనుంది. అనంతరం గుజరాత్ లేదా పశ్చిమ బెంగాల్ వెళ్లనుంది. ఈ ఇరు వేదికలల్లో దాయాది టీమ్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడనుంది