Narendra Modi: ఓటమి దిగులుతో ఉన్న భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా డ్రెస్సింగ్ రూంకు వెళ్లి ధైర్యం నింపారు. ఫైనల్ లో పరాజయంతో తీవ్ర నిరాశలో ఉన్న ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఈ ఓటమి భారత క్రికెట్ జట్టు సామర్థ్యాన్ని ఏమాత్రం తక్కువ చేయబోదని, తామేంటో ఇప్పటికే నిరూపించుకున్నారని స్పష్టంచేసిన ప్రధాని దేశ ప్రజలు ఇప్పుడూ, ఎప్పుడూ మీతోనే ఉంటారంటూ భరోసా ఇచ్చారు.
ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూంను సందర్శించిన ఫొటోతో రవీంద్ర జడేజా భావోద్వేగ స్వరంతో ట్వీట్ చేశాడు. ‘‘టోర్నమెంట్ గొప్ప అనుభవం. నిన్నటి ఓటమితో మా గుండె పగిలింది. అయితే, అభిమానుల మద్దతు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది. డ్రెస్సింగ్ రూంలో నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శన ఎంతో ప్రత్యేకమైనది, అది మాలో స్ఫూర్తిని నింపింది’’ అని ట్వీట్ లో జడేజా పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: కల చెదిరింది.. గుండె పగిలింది.. నిశ్శబ్ధమే మిగిలింది!
మరోవైపు పరాజయ భారంతో మైదానాన్ని వీడినా; టోర్నీలో ఆది నుంచి అత్యద్భుతమైన ఆటతీరును కనబరిచిన భారత జట్టుకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. చివరి వరకూ పోరాట పటిమను ప్రదర్శించిన భారత జట్టుకు అభిమానులు బాసటగా నిలుస్తున్నారు. ధైర్యంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా భారీగా పోస్టులు పెడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా ప్రముఖులంతా టీమిండియా స్ఫూర్తిని ప్రశంసిస్తూ ఇప్పటికే ట్వీట్లు చేశారు. ఇప్పుడూ, ఎప్పుడూ మీతోనే ఉంటామంటూ జట్టులో ధైర్యం నింపారు.