Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులే కాకుండా ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండి అలంకార దర్శనాలు చేసుకుంటున్నారు. ముడుపులు చెల్లించుకునేందుకు వస్తున్న శివస్వాములకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి మాల విరమణ ఇరుముడి సమర్పణలు చేయిస్తున్నారు. శివదీక్షా శిబిరాల దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కూడా అర్చకులు దీక్షా విరమణ చేస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం సాయంత్రం స్వామి అమ్మవార్లకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పట్టువస్త్రాలు , ఫలపుష్ఫాదులను సమర్పించారు.
ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా క్షేత్ర ప్రధాన ప్రాంతాలతోపాటు పాతాళగంగ దగ్గర పుణ్యస్నానాల కోసం ఏర్పాటు చేసిన జల్లు స్నాన ఘట్టాలను, పార్కింగ్, టోల్ గేట్, ఉద్యానవనాలను ఈవో పెద్దిరాజు పరిశీలించారు. యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను దుర్వినియోగం చేయకుండా ప్రతిఒక్కరూ వినియోగంచుకునేలా ఉంచాలని కోరారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు నిలిపివేసినప్పుటికీ యాత్రికుల శ్రేయస్సును పరిగణలోనికి తీసుకుని నది ఒడ్డున ప్రత్యేక శిక్షణ పొందిన గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవస్తానం నిర్వహించే అన్నదాన భవనంలో అల్పాహార భోజన సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.
ఇక ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధన వేదికతోపాటు పుష్కరిణి, నిత్యకళావేదిక, శివదీక్షా శిబిరాల్లో భూ కైలాస్ హరికథా గానం, శివపార్వుతుల కథాగానం, సత్య హరిశ్చంద్ర నాటికలతోపాటు కూచిపూడి, భరత నాట్య కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఇది కూడా చదవండి: నలుపు చాలామందికి నచ్చదు..కానీ ఈ 4 రాశుల వారికి చాలా అదృష్టమట..!