Andhra Pradesh: విశాఖపట్నంలోని మధురవాడ బక్కన్నపాలెంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. గత నెల ఓ ఫొటోగ్రాఫర్ హత్య జరగగా.. ఈ మర్డర్ వెనుక షణ్ముఖ్ తేజ (19) ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫిబ్రవరి 26న పోతిన సాయి పవన్ కల్యాణ్ అనే ఫొటోగ్రాఫర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. దర్యాప్తు ప్రారంభించారు. చివరికి షణ్ముఖ్ తేజ అనే 19 ఏళ్ల యువకుడు ఈ హత్యకు కారణమని గుర్తించారు.
Also Read: మరో పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి.. ఏపీ హైకోర్టులో పిల్
గోదావరి ఒడ్డున సాయి మృతదేహం
ఆన్‌లైన్‌లో ఫొటోషూట్ కన్ఫర్మ్ చేసుకున్న సాయి.. గత నెల 26 రావులపాలెం వెళ్లాడు. కానీ అక్కడ అనుమానం రావడంతో.. కారు వివరాలు, తన ఫోన్ కలవకపోతే షణ్ముఖ్ నెంబర్‌కు కాల్ చేయాలని తన తల్లిదండ్రులకు మెసేజ్ పంపించాడు. అయితే మూడు రోజులుగా సాయి కాంటక్ట్ లేకపోవడంతో.. అతని తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. షణ్మఖ్ నెంబర్‌ను ఫోన్ చేసినా ఎలాంటి స్పందన రాలేదు. చివరికి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. జొన్నాడ, మూలస్థానం మధ్య గోదావరి ఒడ్డున ఇసుకలో సాయి మృతదేహాన్ని గుర్తించారు.
కెమెరా కోసమే
సాయి వద్ద ఉన్న రూ.15 లక్షల విలువైన అత్యాధునిక కెమెరాల కోసమే హత్య జరిగనట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే పరారీలో ఉన్న షణ్ముఖ్ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రావులపాలెంలో అతడి ఇంటికి వెళ్లి విచారించారు. అతడి గది తాళం పగలగొట్టి కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే షణ్ముఖ్‌కు పరిచయమున్న అమ్మాయిలతో చాటింగ్ చేయించారు. చివరికి ఒక అమ్మాయి చేసిన మెసేజ్‌కు షణ్ముఖ్ స్పందించాడు. దీంతో పోలీసులు అతడ్ని ట్రేస్ చేసి పట్టుకున్నారు.