Indus Appstore: మనం ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేయాలంటే అండ్రాయిడ్ యూజర్లు అయితే గూగుల్ ప్లే స్టోర్.. ఐఫోన్ యూజర్లు అయితే యాపిల్ స్టోర్‌లో మాత్రమే చేసుకోవాలి. దశాబ్ధ కాలంగా ఈ రెండింటి ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు వీటి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు దేశీయ ఫిన్ టెక్ సంస్థ ఫోన్ పే కొత్త ప్లే స్టోర్‌ను తీసుకువచ్చింది. ఇండస్ యాప్ స్టోర్ పేరుతో దీనిని అందుబాటులోకి తెచ్చింది. అంతేకాకుండా యాప్ డెవలెపర్స్‌కు జాయినింగ్ ఆఫర్ కూడా ప్రకటించింది. తమ స్టోర్‌లో యాప్స్ లిస్ట్ చేయాలని డెవలపర్లను కోరింది. ఇండస్ యాప్ స్టోర్‌లో యాప్స్ రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది.
రిజిస్టర్ చేసుకున్న వారి నుంచి తొలి ఏడాది ఎలాంటి రుసులు వసూలు చేయమని ప్రకటించింది. అలాగే తమకు నచ్చిన పేమెంట్ గేట్‌వేను ఉచితంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. 12 స్థానిక భాషల్లో ఇండస్ యాప్ స్టోర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం గూగుల్, యాపిల్ స్టోర్లు అయితే 30శాతం కమీషన్ వసూలు చేస్తున్నాయి. అలాగే నచ్చిన పేమెంట్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఎంచుకోకుండా డెవలపర్లను నియంత్రణలో పెట్టుకున్నాయి.
2026 నాటికి భారత్‌లో 100 కోట్ల మందికి పైగా స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉంటారని ఇండస్ యాప్ స్టోర్ సహా వ్యవస్థాపకుడు, సీపీఓ ఆకాశ్ డోంగ్రే తెలిపారు. లోకలైజ్డ్ ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ నిర్మించడానికి ఇది అద్భుతమైన అవకాశం అన్నారు. భారీగా ఉన్న వినియోగదారుల మార్కెట్, యాప్ డెవలపర్లు ఉన్నా.. యాప్‌ల పంపిణీకి ఒకే ఒక యాప్ స్టోర్ గూగుల్ ప్లే స్టోర్‌తోనే ఆధారపడి పని చేయాల్సి వస్తుందన్నారు. అందుచేత భారత్‌లోని యాప్ డెవలపర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌కు గట్టి ప్రత్యామ్నాయంగా నిలవగలమనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: బంగారం కొనాలనుకుంటున్నారా ? అయితే ఇదే మంచి ఛాన్స్..ఇవాళ తులం ఎంతంటే..?