Owl : రాత్రిపూట సరిగ్గా నిద్రలేకపోవడమనేది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. ఒత్తిడి, ఆందోళన(Stress) వంటి కారణాల వల్ల నిద్రలేమి సమస్య(Insomnia Problem) తో బాధపడుతుంటారు. అయితే వీటితోపాటు పోషకాహార లోపం వల్ల కూడా నిద్రలేమి సమస్య తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విటమిన్స్, మినరల్స్, ప్రొటీన్లు, పిండి పదార్థాలు, సమభాగాల్లో కలిగి ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
సమతుల్య ఆహారం శరీర బరువును పెరగకుండా చూడటంతోపాటుగా ఆయుష్షును కూడా పెంచుతుంది. గుండెజబ్బులు(Heart Problems), డయాబెటిస్(Diabetes), జీవక్రియ రుగ్మతలు వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అయితే కొన్ని రకాల విటమిన్ల లోపం వల్ల కూడా నిద్రలేమి సమస్య వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది.
ఏ విటమిన్ లోపం వల్ల నిద్రలేమి వస్తుంది?
విటమిన్ డి(Vitamin D) లోపం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. ఇది పిల్లలు,పెద్దలలోనిద్ర లేమికి కారణం అవుతుంది. నిజానికి, విటమిన్ డి మెదడుకు ప్రత్యేక పద్ధతిలో పనిచేస్తుంది. విటమిన్ డి గ్రాహకాలు మెదడులోని కొన్ని ప్రాంతాలలో చాలా నిర్దిష్టమైన రీతిలో పనిచేస్తాయి. ఇవి నిద్ర నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషించే పేస్‌మేకర్ కణాలుగా భావిస్తారు. ఇది నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్‌ను నియంత్రిస్తుంది.
అలాంటి పరిస్థితిలో, డి విటమిన్ లోపం కారణంగా, మెలటోనిన్ లేకపోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. ఇది మాత్రమే కాదు, దీని లోపం శరీరం నిద్ర చక్రంను మరింత దిగజార్చుతుంది, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా వంటి సమస్యలు కూడా సంభవించవచ్చు.
విటమిన్ డి లోపాన్ని ఎలా నివారించాలి :
విటమిన్ డి లోపాన్ని అధిగమించడానికి ఉదయాన్నే సూర్యరశ్మి(Sunshine) కి నిల్చోవాలి. సూర్యరశ్మి నుంచి అధికమొత్తం డి విటమిన్ పొందవచ్చు. ఇది మీ శరీరం నిద్ర చక్రాన్ని మెరుగుపరుస్తుంది. ఎందుకంటే సూర్యరశ్మి మన కళ్ళ ద్వారా మెదడు పనితీరును ప్రారంభిస్తుంది. మీరు ఎప్పుడు నిద్రపోవాలో అది నిర్ణయిస్తుంది. ఇవేకాకుండా పాలు, గుడ్డు, పుట్టగొడుగుల వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం కూడా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
విటమిన్ డి మాత్రమే కాకుండా విటమిన్ ఇ, విటమిన్ బి6, విటమిన్ సి కూడా లోపించినట్లయితే నిద్రలేమి సమస్యను ఎదుర్కొవల్సి వస్తుంది. అందుకే సమతుల్య ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఈ లోపాన్ని అధిగమించవచ్చు.
ఇది కూడా చదవండి: ఈసారి రంజాన్ పండుగ ఎప్పుడొచ్చింది..చంద్రోదయ సమయం,ప్రాముఖ్యత.!