మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.చిత్తూరు జిల్లా పర్యటనలో పెద్దిరెడ్డిపై చంద్రబాబు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పెద్దిరెడ్డిని నిలదీస్తూ ఏం పుంగనూరు పుడింగివా అంటూ బాబు పెద్దిరెడ్డిని నిలదీశారు. అంతే కాకుండా చంద్రబాబుని పుంగనూరులో అడుగు కూడా పెట్టనివ్వలేదు.
దీంతో పెద్ద గొడవే జరిగింది. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ కార్యకర్తల పై కేసులు నమోదు చేయడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వైఖరిని పెద్దిరెడ్డి తప్పు పట్టారు. పుంగనూరు ఘటనలో అక్రమ కేసులు లేనే లేవన్నారు. పోలీసులు పెట్టే కేసులతో తమకేం సంబంధమని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
నిజానికి పుంగనూరు ఘటనలో మొదటి నిందితుడిగా చంద్రబాబును చేర్చాలన్నారు. వాలంటీర్ల పై బురద చల్లడానికి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
పుంగనూరు ఘటనలో దాదాపు 50 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. కొట్టండ్రా, చంపండ్రా అని చంద్రబాబే రెచ్చగొట్టారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలో తన కుమారుడైన రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.
ప్రజాబలం ఉన్న నాయకుడిని బాబు ఎదుర్కోలేరన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని చూస్తుంటే... ముగ్గురూ ఒకే స్కూల్ స్టూడెంట్స్‌గా కనిపిస్తున్నారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలు అందర్నీ గమనిస్తున్నారని చెప్పారు.
పుంగనూరులో చంద్రబాబును అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలపై దాడులను ఖండిస్తున్నట్టు పవన్‌కల్యాణ్ ఒక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే లోకేశ్ కూడా పెద్దిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పెద్దిరెడ్డి వారికి చీవాట్లు పెట్టారు.
విద్యుత్ రేట్ల విషయంలో ప్రభుత్వ పాత్ర ఉండదని, విద్యుత్ రెగ్యులేటరీ బోర్డు చూసుకుంటుందని చెప్పారు. చంద్రబాబు హయాంలో కూడా ట్రూ అప్, ట్రూ డౌన్ ఛార్జీలు ఉన్నాయన్నారు. చంద్రబాబు బషీర్ బాగ్ లో ఎందుకు కాల్పులు జరిపించారో చెప్పాలని ప్రశ్నించారు.
నాది అయితే బంగారం, మీది అయితే మట్టి అనే తీరు చంద్రబాబుదని విమర్శించారు. కొవిడ్ సమయంలో చంద్రబాబు హైదరాబాద్ లో దాక్కుంటే..ఇంటింటికీ తిరిగి సేవ చేసింది వాలంటీర్లేనని అన్నారు.