పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై సంచల వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో మల్లారెడ్డి పేదవాళ్ల గుడిసెలు కూల్చేసి వారికి నీడ లేకుండా చేశారంటూ ఆరోపించారు. పేదలపై తమ ప్రతాపాన్ని చూపించే పోలీసులు.. చెరువులు మింగేసిన మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్‌నగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో రేవంత్ మాట్లాడారు. అలాగే నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్.. జవహర్ నగర్ డంపింగ్ యార్డు తప్ప ఇక్కడి ప్రజలకు ఇచ్చింది ఏం లేదంటూ మండిపడ్డారు. టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి కేసీఆర్.. మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. మేడ్చల్‌కు ఐటీ కంపెనీలు తీసుకొస్తామని హామీ ఇచ్చి దాన్ని తుంగలో తొక్కారని.. కేసీఆర్, మల్లారెడ్డి తోడుదొంగల్లా దోచుకుంటున్నారని విమర్శించారు.
Also read: ఇండస్ట్రీని కలవరపెడుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో
కేసీఆర్ ఎన్ని వందల కోట్లకు టికెట్లు అమ్ముకున్నారంటూ రేవంత్ ప్రశ్నించారు. అలాగే జవహార్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలుచేసి తీరుతామని హామీ ఇచ్చారు. మరోవైపు కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాలకే కుంగిపోయిందని.. ఆయన పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆగమైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఆగం చేసిన కేసీఆర్‌ను పొలిమేరలు దాటేవరకు తరమాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
Also read: నన్ను సీఎం అనకండి ప్లీజ్.. బండి సంజయ్ రిక్వెస్ట్!