Janasena: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి టీడీపీ నేతలతో జరిపిన భేటీ సఫలం అయ్యింది. దాదాపు గంటపాటు ఆయన సుదీర్ఘంగా మాట్లాడిన తీరుతో టీడీపీ ముఖ్యనాయకులు శాంతపడినట్లే కనిపించారు. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుతో కలిసి పనిచేసేందుకు సూత్రప్రాయంగా వారంతా అంగీకారం తెలిపారు .తిరుపతి అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థిగా జనసేన తరపున ఆరణి శ్రీనివాసులును ప్రకటించి మూడు వారాలు కావస్తున్నా..ఇంకా కొందరు అలకపాన్పు దిగకపోవడంపై పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు.
శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరుకున్నారు. తిరుచానూరు సమీపంలోని గ్రాండ్ రిడ్జ్ హోటల్లో కూటమి పార్టీలతో ఆయన విడివిడిగా మాట్లాడారు. ముందుగా టీడీపీ ముఖ్యనేతలతో ఆయన భేటీ అయ్యారు. ‘ఆరణి శ్రీనివాసులు అభ్యర్థిత్వం గురించి చంద్రబాబు , నేనూ కలిసి తీసుకున్న నిర్ణయం. ఆయన టికెట్ కోసం పార్టీలో చేరలేదు. చేరిన తర్వాతే టికెట్ ఇస్తామని మేము హామీ ఇచ్చామన్నారు.
అతను నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. స్థానికేతరుడు ఎందుకవుతారు? టీడీపీ, ప్రజారాజ్యం పార్టీలకు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. చంద్రబాబుకు బాగా సన్నిహితుడు. తిరుపతిలో సొంత ఇల్లు కూడా ఉంది. కాంట్రాక్టర్‌గా తిరుపతిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. కలసి పనిచేయండి. ఎన్నికల ఫలితాల తర్వాత మీ కష్టాన్ని వృథా కానివ్వము అంటూ పవన్ చేతులు జోడించి అడగడంతో నేతలు ఆలోచించి కలిసి పనిచేసేందుకు అంగీకరించారు.
టీడీపీ ఇంఛార్జి సుగుణమ్మ కష్టం కూడా అందరికీ తెలుసునని, గత ఎన్నికల్లోనే ఆమె గెలిచారని, ఆమెకు ఏమి చేయాలో చేస్తామని హామీ ఇచ్చారు. ఆమెతో మళ్లీ ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు. ఆరణి శ్రీనివాసులు గెలుపుకన్నా అరాచక శక్తుల ఓటమే లక్ష్యంగా కార్యకర్తలంతా కలిసి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.
దశాబ్దకాలం పాటు దార్శనికుడైన చంద్రబాబుతో కలిసి నడవాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను అనకాపల్లి టికెట్ తనకు ఇస్తారనే ఉద్దేశంతో సుమారు నెల రోజులు పాటు నియోజకవర్గంలో ప్రచారం చేశానని....పొత్తులో భాగంగా వేరేవాళ్లకు ఇవ్వాల్సి రావడంతో తప్పుకున్నానన్నారు.
Alsor read: సీబీఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత