జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆయన లోకేష్ పాదయాత్ర యువగళం ముగింపు సభకోసం విశాఖ రావాల్సి ఉంది. కానీ ఆయన ఆరోగ్య కారణాలతో సభకు గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు వివరించారు.
ఏపీలోని అధికార పక్షం చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండో విడత యువగళం పాదయాత్రను మంగళవారంతో ముగించారు. దీని విజయోత్సవ సభను తెలుగు తమ్ముళ్లు విజయనగరంలోని పోలిపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ ఇద్దరు కూడా విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. వీరిద్దరికి తెలుగు తమ్ముళ్లు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సభకు జనసేన అధినేత కూడా హాజరు కావాల్సి ఉండగా..ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు జనసేన కార్యకర్తలు తెలిపారు.
ఇప్పుడు ఆయన యువగళం పాదయాత్రలో పాల్గొనే విషయం పై సందిగ్దత ఏర్పడింది. ఎక్కువ శాతం ఆయన గైర్హాజరు అయ్యే సూచనలే కనిపిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆయన కనుక ఈ సభకు హాజరు అయితే ఒకే వేదిక పై చంద్రబాబు, పవన్ పది సంవత్సరాల తరువాత కనిపించబోతున్నారు.
Also read: ఐపీఎల్ లో మొట్టమొదటి ట్రైబల్ ఆటగాడు..రాబిన్ మింజ్