Tirupati: ఇస్రో శాస్త్రవేత్తలు నిజమైన హీరోలంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. మంగళవారం తిరుపతిలోని శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక బాలీవుడ్ సినిమాకు అయ్యే ఖర్చుకంటే తక్కువ డబ్బులతో రాకెట్ ప్రయోగాలు చేస్తున్నారన్నారు.
చిన్ననాటి కల నెరవేరింది..
ఈ సందర్భంగా షార్ డైరెక్టర్ రాజరాజన్ చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగ నమూనాను ఇస్రో అధికారులు పవన్‍కు అందించారు. దీనిపై సంతోషం వ్యక్తం చేసిన పవన్.. శ్రీహరికోట సందర్శనతో తన చిన్ననాటి కల నెరవేరిందన్నారు. రాకెట్ ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలను యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసపత్రాలు అందించిన పవన్.. భారత ప్రధాని నరేంద్రమోదీ శాస్త్రవేత్తలకు మద్దతుగా నిలవడంతో ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయంటూ కొనియాడారు.