Panchayathi Elections: ఆగస్టులో తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు కాంగ్రెస్ వర్గీయులు. ఈ విషయంలో తెలంగాణ సీఎ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంలో ఉన్న పార్టీకే స్థానిక సంస్థల్లో అడ్వాంటేజ్ రానుంది. అదీకాక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి వారం రోజుల క్రితం ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సంబంధించిన అంశాలను వెల్లడించాలని అధికారులకు సీఎం సూచించారు. గత పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన విధానం, రానున్న పంచాయతీ ఎన్నికలకు అనుసరించాల్సిన విధానాలను అధికారులు రేవంత్ రెడ్డికి వివరించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మొత్తం ఉన్న గ్రామ పంచాయతీలు 12,751. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2019 పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దే హవా నడిచింది. 2019లో టీఆర్ఎస్ గెలిచిన పంచాయతీలు 7,774 కాగా...కాంగ్రెస్ గెలిచిన పంచాయతీలు 2,709. ఇక బీజేపీ గెలిచినవి 163. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 65 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు చేసింది. దీంతో 2024 పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగే ఛాన్స్ ఉందని సమాచారం. మరోవైపు ఈసారి టీఆర్ఎస్ గెలవబోయే పంచాయతీలు 3,000 నుంచి 3,449 వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలాగే అధికార కాంగ్రెస్ గెలవబోయే పంచాయతీలు 8,000 - 8,385 అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలవనున్న పంచాయతీలు 1,000 - 1,304 ఉంటాయని చెబుతున్నారు.