Pakistan: పాకిస్థాన్‌లో ఎన్నికలు ముగిశాయి. ప్రధానమంత్రి ఎవరూ అనేదానిపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లో అక్కడి సైన్యం రాజకీయాలను శాసిస్తుందనేది అందరికీ తెలిసిందే. నాలుగోసారి ప్రధాని కావాలని కలలు గన్న నవాజ్ షరీఫ్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. దీంతో ప్రధాని పదవికి తన సోదరుడు షహబాజ్ షరీఫ్‌ను నామినేట్ చేశారు. అయితే ఈ నిర్ణయం వెనుక పాకిస్థాన్ ఆర్మీ హస్తం ఉన్నట్లు తెలిసింది. నవాజ్ షరీఫ్.. తమ కూతురు అలాగే రాజకీయ భవిష్యత్తు కోసమే ఆర్మీకి తలొగ్గినట్లు సమాచారం.
నవాజ్‌కు షరతులు
వాస్తవానికి పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యం వహించేది నవాజ్ షరిఫే. కానీ ఈ ఎన్నికల్లో PML-N పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోకపోవడంతో.. పాక్ ఆర్మీ నవాజ్‌కు కొన్ని షరతులు పెట్టింది. ప్రధానమంత్రి పదవి కావాలా ? లేదా కుమార్తె పంజాబ్ సీఎం కావాలా ? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలని ఆయనకు ఆదేశించింది. ఒకవేళ ప్రధాని పదవి ఎంచుకుంటే పంజాబ్ సీఎం పగ్గాలు షహబాజ్‌కు ఇవ్వాలని చెప్పింది. దీంతో కూతురు భవిష్యత్తు కోసం నవాజ్ ప్రధాని రేసు నుంచి తప్పుకున్నట్లు PML-N పార్టీ నేత ఒకరు తెలిపారు.
Also Read: ట్రంప్‌కు మరో కేసులో.. రూ.2900 కోట్ల భారీ జరిమానా
సంకీర్ణ ప్రభుత్వానికి సిద్ధం
ఇదిలాఉండగా అక్కడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మెజార్టీ రాలేదు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు 92 స్థానాల్లో గెలుపొందారు. అయితే నవాజ్ షరీఫ్ పార్టీ (PML-N) 80 స్థానాలను దక్కించుకుంది. అలాగే బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) 54 స్థానాల్లో గెలిచింది. దీంతో పీఎంఎల్-ఎన్... పీపీపీతో సహా పలు చిన్న పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రెడీ అయిపోయింది.
పంజాబ్ తొలి సీఎంగా నవాజ్ కూతురు
ముందుగా నవాజ్ షరీఫే మళ్లీ ప్రధాని బాధ్యతలు చెపడతారని వార్తలు వచ్చాయి. కానీ కాలం పరిస్థితుల్ని మార్చేసింది. నవాజ్ షరీఫ్ అనూహ్యంగా ప్రధాని రేసు నుంచి తప్పుకొని తన సోదరుడ్ని నామినేట్ చేశారు. అయితే మార్చి మొదటివారంలో షహబాజ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. మరోవైపు పంజాబ్ తొలి మహిళా సీఎంగా.. నవాజ్ షరీఫ్ కూతురు బాధ్యతలు చేపట్టనున్నారు. మరో విషయం ఏంటంటే ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ఉన్నప్పటికీ కూడా వెనుక నుంచి రాజకీయ చక్రం తిప్పేది మాత్రం నవాజ్ షరీఫే అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
Also read: నావల్ని మరణానికి పుతినే బాధ్యుడు.. బైడెన్ సంచలన ఆరోపణలు..