Megastar : నటుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగానూ మరో అత్యున్నత పురస్కారం దక్కింది. ఇప్పటికే 2006లో ‘పద్మ భూషణ్’ అందుకున్న ఆయనకు మరో అత్యున్నత పురష్కారమైన ‘పద్మ విభూషణ్’ కూడా(Padma Vibhushan) వరించింది. ఈ సందర్భంగా చిరంజీవిగా మన్ననలు పొందుతున్న శివశంకర వరప్రసాద్ ప్రస్థానాన్ని ఒకసారి మీ ముందుంచే ప్రయత్నం.
ఆరేళ్ల నుంచే ఆసక్తి..
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్(Sivasankara Varaprasad). అయితే తన తాత శివుని భక్తుడు కావడంతో తల్లిదండ్రులు ఆయనకు ఈ పేరు పెట్టారు. ఇక ఆరేళ్ల వయసునుంచే డ్యాన్స్ చేయడం, రామాయణ, భాగవతాలపై ఆసక్తి చూపించేవాడట శివశంకర్. కానీ ఆయన పేరెంట్స్ మాత్రం పెద్ద పోలీస్ ఆఫీసర్ ను చేయాలని కలలు కనేవారట.
Also Read : ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకం అంటే ఏంటి..ఇక కరెంటు బిల్లుల నుంచి విముక్తి..!!
మొదటి నాటకం..
వరప్రసాద్ చదువుతున్న స్కూల్లో కల్చరల్ ప్రొగ్రామ్స్(Cultural Programs) నిర్వహించగా అనుకోకుండా ఒక నాటికలో 'పరంధామయ్య' పాత్ర పోషించే అవకాశం వచ్చిందట. ఈ నాటికలో తన నటనతో అందరినీ అలరించగా మొదటి బహుమతి అందుకున్నాడట. దీంతో తన కొడుకు ఎలాగైనా సినిమా హీరో అవుతాడని గమనించిన తల్లిదండ్రులు.. ఇక ఏ ప్రొగ్రామ్ కు వెళ్లాల్సివచ్చినా నో చెప్పలేదట. అలా ఇంటర్ లో బైపీసీ స్టూడెంట్ గానూ మంచి ప్రతిభ కనబరిచిన నటుడు.. ఇదే క్రమంలో ఏపీ తరఫున ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని పోలేరమ్మ జాతర అనే నాటికలో తన ప్రతిభ కనబరిచి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడట. అప్పటినుంచి అతనికి కూడా నటుడిని అవుతాననే నమ్మకం కలిగిందట.
మొండి పట్టుదల..
ఈ క్రమంలోనే నటనలో శిక్షణ తీసుకునేందుకు ఒక ఇన్ స్టిట్యూట్ కు దరఖాస్తు పెట్టుకోగా వెంటనే వాళ్లు అంగీకరించి రమ్మన్నారట. కానీ తండ్రి సినిమా ఫీల్డ్ అసలే వొద్దని, అక్కడ తట్టుకోలేవని ససేమీర అన్నాడట. అయినా మొండి పట్టుదలతో మద్రాస్(Madras) రైలు ఎక్కేశాడు వరప్రసాద్.
'పునాది రాళ్లు' పడ్డాయి..
అనుకున్నట్లుగా మద్రాస్ చేరిన ఆయన కేవలం ఐదు నెలల ట్రైనింగ్ లోనే 'పునాది రాళ్లు' అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నాడట. ఆ ఆనందాన్ని తన కుటుంబంతో పంచుకునేందుకు ఇంటికొచ్చిన శంకర్ కు మరో ఊహించని అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. పునాది రాళ్లు సినిమా షూటింగ్ నడుస్తుండగానే 'ప్రాణం ఖరీదు'కు సైన్ చేశాడు. అయితే రెండో సినిమానే మొదట విడుదలవగా ఇందులో ఇతని టాలెంట్ కు ఫిదా అయిన ప్రముఖ దర్శకులు బాపు, కే. బాలచందర్ వెంటనే తమ సినిమాల్లో అవకాశం ఇవ్వడంతో శివకు తిరుగులేకుండా పోయింది.
చిరంజీవిగా నామకరణం..
శివ శంకర వరప్రసాద్ గా పిలవబడుతున్న ఆయనకు ఒకరోజు తన పేరు మార్చుకోవాలనే ఆలోచన తట్టిందట. దీనికోసం ఇంట్లో వాళ్ల సలహాలు తీసుకున్నారు. అయినా ఏ పేరు నచ్చలేదు. అయితే ఒక రాత్రి తనకు 'చిరంజీవి' అంటూ వచ్చిన కలను అమ్మతో పంచుకుంటూ.. చిరంజీవి అంటే హనుమంతుడే కదా? అని అమ్మను అడిగాడట. దీంతో వెంటనే ఇకపై నీ పేరు చిరంజీవి అని తల్లి అంజనాదేవి(Anjana Devi) ఫిక్స్ చేసిందట. అప్పటి నుంచి చిరంజీవి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది.
మెగాస్టార్‌గా..
తొలినాళ్లలో సుప్రీం హీరోగా అలరించిన చిరంజీవి 1988లో వచ్చిన ‘మరణ మృదంగం’ సినిమాతో మెగాస్టార్‌గా మారారు. 1980, 1983లో అత్యధికంగా 14 చిత్రాల్లో నటించిన ఆయనను.. ‘చిరంజీవి కళాకారుడు కాదు కళాకార్మికుడు’ అని రావుగోపాలరావు పొగిడేవాడు. అలాగే ‘ఉదయించే సూర్యుడు సాయంత్రానికి అలసిపోతాడు. కానీ అలుపెరగని సూర్యుడు చిరంజీవి’ అని బ్రహ్మానందం ఇప్పటికీ అంటుంటారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి హేమాహేమీలతో నటించి తనకంటూ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. చిరంజీవి నట ప్రస్థానం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఖైదీ' ముందు 'ఖైదీ' తర్వాత’ అనాల్సిందే.
నంబరు 1హీరో అవుతానని ఛాలెంజ్..
ఒకసారి ఓ సినిమా చూసేందుకు వెళ్లిన చిరు ముందు వరుసలో కూర్చున్నాడట. అయితే సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవర్, మేకప్‌మ్యాన్‌లు వచ్చి అక్కడినుంచి పొమ్మన్నారట. చేసేదేమీలేక నిలబడి సినిమా చూశారట. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత భార్య అడగడంతో.. ‘ఆంటీ మీ హీరో మమ్మల్ని డోర్ దగ్గర నిలబెట్టాడు. మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. కానీ.. 'ఈ సినిమా ఇండస్ట్రీకి నేను నంబరు 1 హీరోను కాకపోతే అడగండి’ అని చిరంజీవి ఆవేశంలో చేశాడట. అన్నట్లుగానే ఛాలెంజ్‌ను ఎట్టకేలకు నెగ్గి ఔరా అనిపించాడు ఈ అందరివాడు.
తొలి భారతీయ నటుడిగా..
ఇక 45ఏళ్లుగా ప్రజలకు వినోదాన్ని పంచుతున్న ఆయన.. వ్యక్తిగత జీవితంలోనూ అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు. రాజకీయ నాయుకుడిగానూ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చినప్పటికీ అనుహ్య పరిణామాలతో యూ టర్న్ తీసుకున్నారు. అలాగే వ్యక్తిగత వెబ్‌సైట్ కలిగిన తొలి భారతీయ నటుడిగా చిరంజీవికి రికార్డు ఉంది. 1999-2000 సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా ‘సమ్మాన్’ అవార్డు పొందారు. 90ల్లో కోటికిపైగా అత్యధిక పారితోషికం తీసుకున్న తొలి భారతీయ నటుడిగా, ‘ఆస్కార్’ వేడుకలో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా చరిత్రలో నిలిచిపోయారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరు.. 3 సార్లు ఉత్తమ నటుడిగా ‘నంది’ పురస్కారం (స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర) అందుకున్నారు. తొమ్మిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు (2016), ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2022), పద్మ భూషణ్ అవార్డు (2006) అందుకున్న ఆయన.. ఇప్పుడు ‘పద్మ విభూషణ్ చిరంజీవి’గా మన్ననలు పొందుతున్నారు.
Also Read : Union Budget 2024: బడ్జెట్ నుంచి వ్యాపారవేత్తలు కోరుకుంటున్నది ఇదే..