Jai Ram Ramesh: దేశంలో పదేండ్ల పాటు అప్రకటిత ఎమర్జెన్సీ విధించిన ప్రధాని మోదీ కపట నాటకంతో మరోసారి పతాక శీర్షికలను ఆకర్షించే పని చేశారని ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు. ఈ ఏడాది జూన్ 4న దేశ ప్రజలు మోదీకి నైతిక, వ్యక్తిగీత, రాజకీయ ఓటమిని కట్టబెట్టి చరిత్రలో మోదీ ముక్త్ దివస్‌ను లిఖించారని అన్నారు. రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలపై ఓ పద్ధతి ప్రకారం మోదీ దాడికి తెగబడ్డారని దుయ్యబట్టారు. మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగాన్ని రూపొందించలేదని పేర్కొంటూ భారత రాజ్యాంగాన్ని సంఘ్ పరివార్ వ్యతిరేకించిందని గుర్తుచేశారు.
జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్‌గా కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమిషా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో లక్షలాది మందిని కటకటాల్లోకి నెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా సంవిధాన్ హత్యా దివస్‌ను పాటించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి దేశంలో చీకటి అధ్యాయానికి తెరలేపారని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ అగ్రనేతలు వీలుచిక్కినప్పుడల్లా కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగాన్ని ఏమాత్రం ఖాతరు చేయని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజ్యాంగం పట్ల ప్రేమ ఒలకబోస్తోందని పలు సందర్భాల్లో కాషాయ నేతలు కాంగ్రెస్‌పై భగ్గుమన్నారు.