8 Year Old Organ Donor Subhajit: సాధారణంగా.. ఎవరైనా ప్రముఖులు, రాజకీయ నేతలు, వివిధ రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నవారు చనిపోతే.. వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తాయి. కానీ ఒడిశాలోని ఓ 8 ఏళ్ల బాలుడి అంత్యక్రియలను ఆ రాష్ట్ర సర్కార్ అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. ఇంత చిన్న పిల్లాడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా. దీని వెనుక కూడా ఓ పెద్ద కారణమే ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
Also Read: చేతుల ట్రాన్స్‌ప్లాంటేషన్..ఢిల్లీ వైద్యుల మిరాకిల్
ఇక వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్‌కు చెందిన శుభజిత్ సాబు(8) అనే బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. ఇటీవల అతడు పరీక్షలకు హాజరవుతుండగా.. ఒక్కసారిగా మూర్ఛ రావడంతో కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో ఆ బాలుడ్ని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. చివరికి అతడు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత అతడి మెదడు పనిచేయడం ఆగిపోవడంతో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం ఆ ప్రభుత్వాసుపత్రి వైద్యులకు వారు లేఖ రాశారు.
ఆ బాలుడి కిడ్నీలతో సహా ఇతర అవయవాలను శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఆ తర్వాత పార్థీవ దేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయం ఒడిశా సర్కార్ (Government Of Odisha) దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ బాలుడికి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపింది. సోమవారం సాయంత్రం పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో సత్యనగర్ రుద్రభూమిలో ఈ అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించారు.
Also Read: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితుడ్ని పట్టిస్తే రూ.10 లక్షల రివార్డు..