NEET 2024 : నీట్‌ యూజీ సవరించిన ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ తుది ఫలితాలు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సవరించిన ఫలితాలను విడుదల చేసింది. దీనిలో 4 లక్షల మంది విద్యార్థులు 5 మార్కులను కోల్పోయారు.

New Update
NEET 2024 : నీట్‌ యూజీ సవరించిన ఫలితాలు విడుదల

NTA Announced NEET UG Final Result : నీట్‌ యూజీ-2024 (NEET UG 2024) పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్‌ ప్రశ్నకు కచ్చితమైన సమాధానాన్ని మాత్రమే అంగీకరించాలని, ఇతర సమాధానాలకు మార్కులు రావని సుప్రీంకోర్టు (Supreme Court) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా ఎన్టీయే (NTA) వ్యవహరించి నీట్ యూజీ తుది ఫలితాలను విడుదల చేసింది. సుప్రీం నిర్ణయంతో 4 లక్షల మంది అభ్యర్థులు 5 మార్కులను కోల్పోయారు. సవరించిన ఫలితాలను ఎన్టీయే అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

కాగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ లీకేజీ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. నీట్‌ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రం లీకైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పాట్నా, హజారీబాగ్‌లలో మాత్రమే పేపర్‌ లీక్‌ అయిందని పేర్కొన్నది. నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తే, గతంలో పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు మే 5న నిర్వహించిన నీట్‌ యూజీ-2024 పరీక్షను రద్దు చేయాలని, మరోసారి పరీక్ష నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేడీ పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది.
నీట్‌ యూజీ-2024 పరీక్షలో అడిగిన ఒక వివాదాస్పద ఫిజిక్స్‌ ప్రశ్నకు సరైన సమాధానంపై ఢిల్లీ ఐఐటీ నిపుణుల కమిటీ మంగళవారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఆ ప్రశ్నకు సరైన సమాధానం ఒక్కటేనని స్పష్టం చేసింది. సంబంధిత ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్లలో నాలుగోది మాత్రమే సరైన సమాధానం అని ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీ తేల్చిందని ధర్మాసనం తెలిపింది. ‘స్టేట్‌మెంట్‌ 1 కరెక్ట్‌.. స్టేట్‌మెంట్‌ 2 కరెక్ట్‌ కాదు’ అని ఆ నాలుగో ఆప్షన్‌ చెబుతున్నదని పేర్కొన్నది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కూడా 4వ ఆప్షన్‌నే సరైన సమాధానంగా ఆన్సర్‌ కీలో సవరించాలని తెలిపింది. ప్రశ్న నంబర్‌ 29కు నాలుగో ఆప్షన్‌ మాత్రమే సరైన సమాధానమని తేల్చింది. ఈ నేపథ్యంలోనే సవరించిన ఫలితాల్లో నాలుగు లక్షల మంది ఐదు మార్కులను కోల్పోవాల్సి వచ్చింది.

Also Read:Paris Olympics: వెరైటీగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు..నదిలో పరేడ్



Advertisment
తాజా కథనాలు