CM Himantha Biswa Sarma: ఆధార్ కార్డుల విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఆధార్ కార్డ్ జారీ చేయాలంటే జాతీయ పౌర నమోదు దరఖాస్తు నంబర్ లేదా ఫామ్‌ను జత చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో అక్రమ వలసలు అరికట్టడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇందులో రాష్ట్ర ప్రజలతో పాటూ వేరే వారు కూడ ఉన్నారని అనుమానంగా ఉందని ముఖ్యమంత్రి హిమంత అన్నారు. అందుకే ఎన్ఆర్‌సీ దరఖాస్తుకు సంబంధించిన రసీదు నంబర్‌ను ఆధార్ కార్డకు అప్లై చేసినప్పుడు జత చేయాలని నిబంధనలు పెట్టామని తెలిపారు. అస్సాంలో ఇక మీదట ఆధార్ కార్డుల జారీ ఎంత మాత్రం సులభం కాదని చెప్పారు. ఎన్‌ఆర్‌సీ నమోదు ప్రక్రియలో భాగంగా బయోమెట్రిక్ లాకయిన 9.55 లక్షల మంది కొత్తగా నంబర్ నమోదు చేయాల్సిన అవసరం లేదని, వారికి కొత్త కార్డులు జారీ చేస్తామని చెప్పారు. తేయాకు ఉన్న ప్రాంతాల వారికీ మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.
బంగ్లాదేశ్ లాంటి పొరుగు దేశాల నుంచి అస్సాంకు అక్రమ వలసలు పెరుగుతున్నాయి. రీసెంట్‌గా అక్కడ అల్లర్లు జరగడం, ప్రభుత్వం మారడం కారణంగా ఇవి మరింత ఎక్కువ అయ్యాయి. రెండు నెలల్లో ఇలా చాలా మంది అస్సాంకు అక్రమంగా తరలివచ్చారు. అందుకే ఆధార్ కార్డ్ నిబంధనలు మార్చడంతో పాటూ సరిహద్దు దగ్గర భద్రతను కూడా కట్టుదిట్టం చేశామని సీఎం హిమంత తెలిపారు.