మహిళలపై నేరాలను అదుపు చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళలను వేధింవులకు గురి చేసే వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హుల ప్రకటించనున్నట్టు పేర్కొంది. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని సీఎం అశోక్ గెహ్లాట్ వెల్లడించారు. మహిళలపై అత్యాచారాలకు, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై పోలీసు ఉన్నతాధికారులతో సీఎం అశోక్ గెహ్లాట్ సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో వున్న శాంతి పూర్వక పరిస్థితులను కొందరు గూండాలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని గుర్తించి వారి పేర్లతో ఓ జాబితాను తయారు చేయాలని పోలీసులను ఆదేశించానన్నారు.
వారి పేర్లను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లకు పంపిస్తామన్నారు. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. మహిళలపై ఎలాంటి వేధింపులకు పాల్పడ్డారో వారి క్యారెక్టర్ సర్టిఫికేట్లలో కూడా ప్రస్తావిస్తామన్నారు. దీంతో వారికి భవిష్యత్ లో కూడా ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు రావని ఆయన స్పష్టం చేశారు.
సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని సామాజిక బహిష్కరణ చే్యాలన్నారు. ఇటీవల రాజస్థాన్ లో మహిళలపై దాడులు పెరిగాయి. దీంతో కాంగ్రెస్ సర్కార్ పై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. చేతకాని సర్కార్ అంటూ తీవ్రంగా మండిపడుతోంది. దీంతో ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.