Vehicle Registration in Telangana: వాహనాల రిజిస్ట్రేషన్ ఇక మీద సులభతరం అవనుంది. వాహనాలు కొనుక్కునే వారు ఇబ్బందులు పడకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసే విధంగా కొత్త విధానాలను ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్లు అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ పద్ధతి ఆంధ్రప్రదేశ్‌లో అమలులో ఉంది.అక్కడ సక్సెస్ ఫుల్‌గా రన్ కూడా అవుతోంది. అందుకే ఇప్పుడు తెలంగాణలో కూడా దీన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది. ఒక్కో డీలర్ విక్రయించే వాహనాలు, రిజిస్ట్రేషన్‌కు అవసరమయ్యే టెక్నాలజీ ఇలాంటి వాటినన్నింటినీ అధ్యయనం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతానికి షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) చేస్తున్నారు.
2016లో చెప్పిన కేంద్రం...
నిజానికి షోరూంలలోనే వాహనాలు రిజిస్ట్రేణ్ అయ్యేట్టుగా కేంద్రం 2016 మార్గదర్శకాలు రూపొందించింది. ఆ తరువాత ఏపీతో సహా పలు రాష్ట్రాలు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాయి. అయితే తెలంగాణలో మాత్రం ఇంకా వెహికల్స్ కొనే సమయంలో మొదట టీఆర్ తీసుకొని ఆ తరువాత సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పీఆర్ పొందే విధానం కొనసాగుతోంది. ఈ క్రమంలో చాలా అక్కమాలు జరుగుతున్నాయి. దళారులు లాంటి వారు విపరీతంగా డబ్బులు గుంజేస్తున్నారు. కేంద్రం మార్గదర్శకాలు రాష్ట్రంలోనూ అమలైతే షోరూంలోనే పీఆర్ స్మార్ట్ కార్డుతోపాటు వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ కూడా లభించనుంది.