KTR: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కేంద్రం తమకు రూ.లక్ష కోట్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన వార్తపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం బలమైన ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగలవని అన్నారు. ఇతరులపై ఆధారపడకుండా ఉండే ప్రాంతీయ పార్టీలు మాత్రమే తెలంగాణకు రక్షణగా ఉంటాయన్నారు. తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని దగ్గరి నుంచి చూస్తున్నారని ఆశిస్తున్నానని.. తెలంగాణకు సొంత రాజకీయ గుర్తింపు ఉండటమే ఉత్తమమని పేర్కొన్నారు.
Also Read: ఎమ్మెల్సీ కవితకు షాక్.. ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు!
మరోవైపు.. గురువారం బీఆర్‌ఎస్ విద్యార్థి నాయకులను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. మహబూబ్‌నగర్ మీటింగ్‌లో విద్యార్థులను, నిరుద్యోగ యువతను అవమానించిన రేవంత్.. వాళ్లకి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రేవంత్ విపక్షంలో ఉన్నప్పుడు.. 50 వేల పోస్టులతో మెగా డీఎస్సీని విడుదల చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 6 వేల అదనపు పోస్టులు మాత్రమే ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో మొత్తం 1.62 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ అన్నారు.
అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్‌కు కూడా కేటీఆర్ లేఖ రాశారు. చేనేత కార్మికుల ప్రయోజనం కోసం సిరిసిల్లాకు మెగా పవర్‌లూమ్ క్లస్టర్ తీసుకువచ్చేలా చేయాలని కోరారు. అలాగే త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించేలా బండి సంజయ్ కృషి చేయాలన్నారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాహుల్ గాంధీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై కేటీఆర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పంచ్ న్యాయ్ డాక్యుమెంట్ ప్రకారం.. ఫిరాయింపుల వ్యతిరేక చట్టాలను పటిష్ఠం చేయాలంటూ డిమాండ్ చేశారు.
Also Read: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు ఐదు వేల స్టైఫండ్!