హిందువులకు నవరాత్రులకు ఇచ్చే ప్రముఖ్యత చాలా గొప్పది. పవిత్రమై రోజులుగా భావించే ఈ నవరాత్రుల(Navaratri)ను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు. ఈ 9 రోజులను అత్యంత పవిత్రమైన డేస్‌గా భావిస్తారు. శక్తికి మూలం దుర్గా మాత. ఈ అమ్మవారిని తొమ్మిది విభిన్న రూపాల్లో పూజించే రోజులు ఇవే. సాధారణంగా నవరాత్రి సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలో వస్తుంది. దీనిని శారదీయ నవరాత్రి అని పిలుస్తారు. ఈ సంవత్సరం, శారదీయ నవరాత్రులు ఇవాళ్టి(అక్టోబర్ 15) నుంచి మొదలవుతున్నాయి. ఇవి దసరాతో అంటే అక్టోబర్ 24 వరకు కొనసాగుతాయి. ఆశ్వయుజ శుద్ధ ప్యాఢమి నుంచి ఆశ్వయుజ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి.. పదో రోజు విజయదశమి, దసరా అంటారు.
విజయవాడలో భక్తిల రద్దీ:
నవరాత్రుల తొలి రోజు విజయవాడ దుర్గ గుడిలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. ఉదయం 9గంటలకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తారు. భక్తుల రద్దీని కట్టడి చేసేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అటు ప్రసాదాల విషయంలోనూ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. శనివారం నాటికి మూడు లక్షలకు పైగా లడ్డూలను అధికారులు రెడీ చేసినట్లు సమాచారం. ఇక చాలా దూరం నుంచి వచ్చే భక్తుల కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.
విజయవాడ దుర్గ గుడిపై తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాలు:
① మొదటి రోజు - శ్రీ బాలాత్రిపుర సుందరి
② రెండో రోజు - శ్రీ గాయత్రి దేవి
③ మూడో రోజు - శ్రీ మహాలక్ష్మి
④ నాలుగో రోజు- శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి
⑤ ఐదో రోజు - శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
⑥ ఆరో రోజు - శ్రీ మహా సరస్వతీ దేవి
⑦ ఏడో రోజు - శ్రీ దుర్గా దేవి
⑧ ఎనిమిదో రోజు- శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి
⑨ తొమ్మిదో రోజు- శ్రీరాజరాజేశ్వరి దేవి
మొదటి రోజు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి అలంకారం:
విజయవాడలో దుర్గమ్మను తొలిరోజు శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. బ్రహ్మాండ పురాణంలో , బాలా త్రిపురసుందరి లలితా మహాత్మ్యంలోని 26వ అధ్యాయంలో ఈ దేవి ప్రస్తావన ఉంది. ఈ తల్లి అసుర భండాసుర శక్తులకు వ్యతిరేకంగా పోరాడారు . యుద్ధంలో భండాసురుని ముప్పై మంది కుమారులను వధించారు. బాలా త్రిపుర సుందరిని ఆదిపరాశక్తి దేవి పార్వతి లేదా కామాక్షి, రాజరాజేశ్వరి అని కూడా పిలుస్తారు. మహాత్రిపుర సుందరీదేవి నిత్యం కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత శ్రీబాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా ఈ దేవత అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలమని భక్తుల విశ్వాసం.
ALSO READ: మీ టూత్ పేస్ట్‌లో ఈ పదార్థం ఉందా? అయితే మీరు ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!