Delhi CM: ఢిల్లీ నెక్స్ట్‌ సీఎం ఎవరో తెలుసా ? రేసులో ఉంది వీళ్లే

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించడంతో తదుపరి సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఆప్‌ కీలక నేతలైన అతిషి, కైలాశ్‌ గెహ్లాట్ తదితర నాయకులు సీఎం రేసులో ఉన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Delhi CM
New Update

లిక్కర్‌ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం కేజ్రీవాల్‌ తన పదవికి మరో రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై రాబోయే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చాక మళ్లీ సీఎం బాధ్యతలు చేపడతానని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇటీవల మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అరవింద్ కేజ్రీవాల్‌ విడుదలయ్యాక సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పడం సంచలనం రేపుతోంది. మరి కేజ్రీవాల్ రాజీనామా చేస్తే.. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

సోమవారం ఆప్ నేత మనీశ్ సిసోడియా.. కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లి ఆయన్ని కలిశారు. వారి సమావేశం ముగిశాక బయటికి వచ్చిన మనీశ్ సిసోడియా మీడియాకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే వాళ్లిద్దరూ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపైనే చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే కేజ్రీవాల్‌.. నవంబర్‌లో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికలతో పాటే ఢిల్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు మనీశ్‌ సిసోడియా కూడా తాను ప్రజల్లోకి వెళ్తానని.. ఎన్నికల తర్వాతే మళ్లీ ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. దీంతో మనీశ్ సిసోడియా సీఎం రేసులో లేరని స్పష్టమయ్యింది. అయితే ఈ ముఖ్యమంత్రి బాధ్యతను కొన్ని నెలల వరకే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. ఆప్‌ అధిష్టానం బలమైన నేత కోసం ఎదురుచూస్తోంది. ఆప్‌లో ఉన్న పలువురు కీలక నేతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అతిషి

అతిషి మర్లెనా సింగ్ ప్రస్తుతం విద్యాశాఖ, దివ్యాంగుల శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన అతిషి.. ఢిల్లీలోని పాఠశాలల విద్యా పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. లిక్కర్‌ కేసులో మనీశ్ సిసోడియా అరెస్టయిన అనంతరం అతిషి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేజ్రీవాల్, సిసోడియా జైల్లో ఉన్నప్పుడు.. పార్టీ బాధ్యతలు తీసుకుంది. మరో విషయం ఏంటంటే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి అతిషియే జాతీ జెండా ఎగురవేయాలని కేజ్రీవాల్ సూచించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సెనా ఇది చేసినప్పటికీ.. ఆప్‌ అధిష్టానం అతిషిపై ఎంత నమ్మకం ఉంచిందో ఇక్కడ అర్థమవుతుంది.

సౌరభ్ భరద్వాజ్

సౌరభ్ భరద్వాజ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఈయన విజిలెన్స్, ఆరోగ్య శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఈయన కూడా మనీశ్ సిసోడియా అరెస్టయిన తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. ఈయన ఆప్‌కు జాతీయ ప్రతినిధిగా ఉన్నారు. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా అరెస్టయినప్పుడు సౌరభ్‌ భరద్వాజ్ కూడా పార్టీని ముందుకు నడిపించారు.

రాఘవ్ చద్దా

రాఘవ్ చద్దా.. ఆప్‌ జాతీయ ఎగ్జిక్యూటీవ్‌, పొలిటికల్ అఫైర్స్‌ కమిటి సభ్యుడిగా ఉన్నారు. ఈయన రాజ్యసభలో ఎంపీగా ఉన్నారు. రాఘవ్ చద్దా.. గతంలో చార్టెట్‌ అకౌంటెంట్‌గా పనిచేశారు. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఇందులోనే ఉన్నారు. రాజిందర్‌ నగర్ నుంచి ఈయన ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు. 35 ఏళ్లు ఉన్న రాఘవ్‌ చద్దా.. దేశంలోనే ఓ యువ రాజకీయ నాయకుడిగా తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే పార్లమెంటులో కూడా కీలకమైన సమస్యలపై ఆప్‌ తరఫున గళం విప్పుతునే ఉన్నారు.

కైలాశ్ గెహ్లాట్‌

ఆప్‌ పార్టీలో ఈయన సీనియర్‌ నేతల్లో ఒకరు. వృత్తిరిత్యా లాయర్‌ అయిన కైలాశ్ గెహ్లాట్‌.. రవాణా, ఆర్థిక, హోం శాఖ లాంటి కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2015 నుంచి ఈయన నజఫ్‌రఘ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో అలాగే సుప్రీంకోర్టులో కూడా ఈయన అడ్వకేట్‌గా పనిచేశారు. అంతేకాదు 2005 నుంచి 2007 వరకు హైకోర్టు బార్‌ అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా సేవలందించారు.

సంజయ్ సింగ్

సంజయ్‌ సింగ్ 2018 నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. పార్లమెంటులో కీలక ప్రసంగాలు చేసే ఆప్ నేతల్లో ఈయన ఒకరు. పార్టీని స్థాపించిన వారిలో సంజయ్‌ సింగ్ కూడా ఒకరు. అలాగే ఈయన జాతీయ ఎగ్జిక్యూటీవ్, పొలిటికల్ అఫైర్స్‌ కమిటీకి సభ్యుడిగా ఉన్నారు. రాష్ట్రంలోని కీలక సమస్యలను పరిష్కరించేందుకు మీడియాతో కూడా తరచుగా మాట్లాడుతుంటారు. మరో విషయం ఏంటంటే సంజయ్ సింగ్ కూడా లిక్కర్ కేసులో అరెస్టయ్యారు. ప్రస్తుతం ఈయన కూడా కేజ్రీవాల్, మనీశ్‌ సిసోడియా లాగే బెయిల్‌పై విడుదలయ్యారు.

గోపాల్ రాయ్

గోపాల్ రాయ్‌ విద్యార్థి దశలోనే రాజకీయాలు మొదలుపెట్టారు. ఢిల్లీ రాజకీయ నేతల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం గోపాల్‌ రాయ్‌.. పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, అభివృద్ధి మరియు సాధారణ పరిపాలన శాఖకు మంత్రిగా ఉన్నారు. గతంలో ఓసారి ఎన్నికల ప్రచారంలో ఈయన చేతికి బుల్లెట్ గాయం కూడా అయ్యింది. దీంతో ఆయన పాక్షికంగా పక్షవాతానికి గురయ్యారు. అయితే గోపాల్‌ రాయ్‌ కార్మికుల హక్కుల గురించి పట్టు ఉండటం, వాతావరణ సమస్యలను పరిష్కరించడంలో ఈయన చేసిన కృషి వల్ల ఓటర్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఢిల్లీ ప్రజలు ఎదుర్కొనే కీలక సమస్యలైన.. వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడం నుంచి కార్మికుల సంక్షేమం వరకు సమస్యలను పరిష్కరించడంలో గోపాల్‌ రాయ్‌కు మంచి అనుభవం ఉంది.

వీళ్లందరూ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. మరీ వీళ్లలో ఢిల్లీ ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరి ఆప్‌ అధిష్ఠానం ఎవరికి ఈ పదవిని కట్టబెట్టనుందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

#telugu-news #national-news #delhi-cm
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe