ఏకంగా సుప్రీంకోర్టు సెట్ వేసి.. ఇలాంటి సైబర్ నేరం నెవ్వర్ బిఫోర్!

టెక్స్‌టైల్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్, ఎండీ ఓస్వాల్ సైబర్ మోసగాళ్ల వలలో పడ్డారు. సీజేఐ చంద్రచూడ్ విచారిస్తున్నట్లు కోర్టు సెట్టింగ్ వేసి రూ.7 కోట్లు కొట్టేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందుతులను పట్టుకుని రూ.5.25 కోట్లు తిరిగి రాబట్టారు.

Vardhaman CMD SP Oswal
New Update

ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటుపడి సామాన్యులు, సంపన్నులు అనే తేడా లేకుండా ప్లాన్‌లు వేసి సొమ్ము కాజేస్తున్నారు. ఫోన్‌కు లింకులు పంపించి క్లిక్ చేయండి గిఫ్ట్‌ పట్టండి అంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. అంతేకాకుండా బ్యాంక్ నుంచి కాల్‌ చేస్తున్నట్లు వివరాలు తెలుసుకుని డబ్బులు దోచేస్తున్నారు. అయితే ఇలాంటివి ఇటీవల కాలంలో ఎక్కువగానే చూశాం. కానీ రీసెంట్‌గా జరిగిన ఒక సైబర్ మోసం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఏకంగా ఓ బడా వ్యక్తినే టార్గెట్‌గా చేసుకున్నారు సైబర్ కేటుగాళ్లు. ఎలాగైన కోట్లు కొట్టేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఓ వ్యవహారంలో ఆ వ్యక్తిని నిందితుడిగా చేరుస్తున్నట్లు బెదిరించారు. మేము సీబీఐ ఆఫీసర్లమని ఆ వ్యక్తిని కంగారు పెట్టారు. అంతటితో ఆగలేదు. ఏకంగా జడ్జిలను సైతం రంగంలోకి దించారు. డిజిటల్ కస్టడీ అంటూ నాటకమాడారు. వాట్సాప్ ద్వారా పోలీసుల లోగోలతో అరెస్టు వారెంటు పంపించారు. దీంతో బెదిరిపోయిన ఆ వ్యక్తి వారికి కోట్లలో డబ్బులు ట్రాన్సఫర్ చేశాడు. చివరికి విషయం తెలిసి ఖంగుతిన్నాడు. ఆపై పోలీసులను సంప్రదించగా అసలు విషయం బయటకొచ్చింది. ఇంతకీ ఏ విషయంలో ఆ వ్యక్తిని సైబర్ మోసగాళ్లు బెదిరించారు. డిజిటల్ కస్టడీ ద్వారా ఎలా ట్రాప్ చేశారు అనే విషయానికొస్తే..  

ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన ఎస్పీ ఓస్వాల్ బడా టెక్స్‌టైల్ కంపెనీ వర్ధమాన్ గ్రూప్ సంస్థల చైర్మన్, ఎండీగా ఉన్నారు. అయితే ఎంతో సాఫీగా సాగిపోతున్న ఆయన లైఫ్‌లో ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఆగస్టు 28న ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్‌లో ముంబైలోని కొలాబాద్‌లో ఉన్న సీబీఐ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని అన్నారు. అనంతరం ‘మీ పేరుతో ఉన్న కెనరా బ్యాంక్‌ అకౌంట్‌లో చాలా ఆర్థిక అవకతవకలు జరిగాయి’ అని తెలిపారు. ముఖ్యంగా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్ వ్యవహారంతో మీ అకౌంట్‌కు లింక్ ఉన్నట్లు తెలిసిందని.. దీని కారణంగానే మిమ్మల్ని ఈ కేసులో నిందితులుగా చేరుస్తున్నట్లు సైబర్ నేరగాళ్లు చెప్పారు. 

దీంతో ఓస్వాల్ మాట్లాడుతూ తనకు కెనరా బ్యాంక్‌లో అకౌంటే లేదని తెలిపారు. అంతేకాకుండా జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్ కూడా ఎవరో తనకి తెలియదని చెప్పారు. అయితే ఓ సారి జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణం చేశానని.. ఆ సమయంలో ఆధార్ కార్డు ఇచ్చి ఉంటానని తెలిపారు. దీంతో ఆ సైబర్ మోసగాళ్లు.. ఆ ఆధార్‌కార్డుతోనే ఎక్కడో దుర్వినియోగం జరిగిందని చెప్తూ.. దీని కారణంగానే మిమ్మల్ని ఈ కేసులో నిందితులుగా చేరుస్తున్నట్లు ఇంకాస్త డోస్ పెంచారు. 

డిజిటల్ కస్టడీ

ఇక అక్కడ నుంచి తమ ప్లాన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లారు. ఇందులో భాగంగానే డిజిటల్ కస్టడీలోకి తీసుకుంటున్నట్లు సైబర్ కేటుగాడు చెప్పాడు. ఆపై వెంట వెంటనే మరొకడు వీడియో కాల్ చేసి తాను  ఛీప్ ఇన్వెస్టింగ్ ఆఫీసర్‌నని తన నాటకం మొదలు పెట్టాడు. ఆపై సైబర్ అరెస్టుకు సంబంధించిన నిబంధనలను ఓస్వాల్‌కు వాట్సాప్‌ ద్వారా పంపించాడు. అలా ఇంకొకరు వీడియో కాల్‌లో జాయిన్ అయి ఓస్వాల్ బాల్యం, విద్యాబ్యాసం, ఉద్యోగం, బిజినెస్, ఆస్తుల వివరాలు తెలుసుకున్నాడు. అలా ఓస్వాల్‌తో చాలా మంది వాట్సాప్ వీడియో కాల్‌లో ఉన్నారు. కాల్ కట్ చేయొద్దని.. అలా చేస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని.. కాల్‌లోనే ఉండాలని, బయటకు వెళ్తే తమకు చెప్పాలని వారు అన్నారు. 

సుప్రీంకోర్టు సెట్టింగ్

ఈ కేసు ‘జాతీయ రహస్యాల చట్టం’ కింద నమోదైంది కాబట్టి.. ఈ విషయం గురించి ఎవరికీ చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరికైనా చెప్పారంటే వారికి 3 నుంచి 5 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని బెదిరించారు. ఆపై వీడియో కాల్‌లో కోర్టు విచారణ జరిపారు. ఈ కేసును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ విచారిస్తున్నట్లు సెట్టింగు వేశారు. ఆపై సుప్రీంకోర్టు లోగో, స్టాంపులతో ఓస్వాల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇది మాత్రమే కాకుండా ఈడీ, ముంబై పోలీసుల లోగోలతో కూడా అరెస్టు వారెంటీని ఓస్వాల్‌కు వాట్సాప్ ద్వారా పంపించారు. ఇవన్నీ నిజమేనని ఓస్వా్ల్ బెదిరిపోయాడు. దీంతో కొందరు ఆయనకు కాల్ చేసి మేము ఈడీ, సీబీఐ అధికారులమని.. మిమ్మల్ని ఈ కేసు నుంచి తప్పిస్తామని.. అయితే అందుకు తమకు రూ.7 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

బయటపడ్డ నిజం

దీంతో అప్పటికే బెదిరిపోయిన ఓస్వాల్ వెంటనే వేర్వేరు అకౌంట్లకు రూ.7 కోట్లు ట్రాన్సఫర్ చేశారు. ఈ వ్యవహారమంతా దాదాపు రెండు రోజులు సాగింది. ఇక అంతా అయిపోయిన తర్వాత ఓస్వాల్ తాను మోసపోయానని గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ.5.25 కోట్లను తిరిగి రప్పించారు. 

పాత్రదారులు ఎవరు?

దీని వెనుక ఓ బడా ముఠా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగానే ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారు అస్సాం గౌహతికి చెందిన చౌదరి, ఆనంద్ కుమార్ అనే ఇద్దరుగా గుర్తించారు. అయితే వీరు ఎరలు మాత్రమే.. వీరి వెనుక ఉండి నడిపించింది మాత్రం ఓ మాజీ బ్యాంకు ఉద్యోగి రుమి కలితాగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందుతుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద స్కాం గురించి పోలీసులు స్పందించారు. చట్టం ప్రకారం.. ఎలాంటి డిజిటల్ అరెస్టు లేదని తెలిపారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు.

Also Read :  తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ చిన్న కుమార్తె పలీనా !

#supreme-court #cyber-criminals #sp-oswal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe