/rtv/media/media_files/2025/08/06/uttarakhand-schools-closed-2025-08-06-07-57-01.jpg)
Uttarakhand Schools closed
మంగళవారం మధ్యాహ్నం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో ఊహించని విపత్తు విధ్వంసం సృష్టించింది. కురిసిన భారీ వర్షాల కారణంగా ఖీర్ గంగా నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో ధరాలి పట్టణంలో పెను విధ్వంసం చోటుచేసుకుంది. ఖీర్ గంగా నది ఎగువ పరీవాహక ప్రాంతంలో మేఘాల విస్ఫోటనం జరగడంతో ఒక్కసారిగా వరదలు ఉప్పొంగాయి. 8,600 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పర్యాటక ప్రదేశంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మార్కెట్లు, హోటళ్ళు, నివాస భవనాలు బలమైన ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
Uttarkashi Floods
ఈ ప్రమాదంలో కనీసం నలుగురు మృతి చెందారు. అదే సమయంలో 50 మందికి పైగా గల్లంతైనట్లు, శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు 25 హోటళ్ళు, అతిథి గృహాలు, ఇళ్ళు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా గంగోత్రి ధామ్‌కు వెళ్లే యాత్రికుల మార్గంలో ఉన్న ఈ పట్టణం వరదలతో పూర్తిగా మునిగిపోయింది. దీంతో చార్ ధామ్ యాత్రకు కూడా తీవ్ర అంతరాయం కలిగింది.
భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం, SDRF, NDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు శరవేగంగా చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ ప్రకృతి విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Uttarakhand Schools closed
మరోవైపు ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. దీంతో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. డెహ్రాడూన్, నైనిటాల్, తెహ్రీ, చమోలి, రుద్రప్రయాగ్, చంపావత్, పౌరి, అల్మోరా, బాగేశ్వర్ జిల్లాల్లో నేడు పాఠశాలలు మూసివేశారు. ఈ ఉత్తర్వు ప్రకారం.. 1 నుండి 12వ తరగతి వరకు అన్ని విద్యాసంస్థలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కుంభవృష్టి, వరదల విషాదం తరువాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఫోన్‌లో మాట్లాడారు. విపత్తు బాధిత కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. సహాయ, పునరావాస పనులలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుండి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే గత 24 గంటలుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లు మూసుకుపోయాయి. చార్ ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. వీటి కారణంగానే విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సెలవులను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదుల దగ్గరకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సెలవుల కొనసాగింపుపై క్లారిటీ ఇంకా రాలేదు.