కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై జనగణమన కంటే ముందు వందేమాతరం పాడాల్సిందే!

కేంద్ర ప్రభుత్వం జాతీయ గేయం వందేమాతరం ఆలాపనకు సంబంధించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జాతీయ గీతం (జనగణమన) తరహాలోనే వందేమాతరానికి కూడా ప్రోటోకాల్ ఉండాలని స్పష్టం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

New Update
Modi

Modi

కేంద్ర ప్రభుత్వం జాతీయ గేయం వందేమాతరం ఆలాపనకు సంబంధించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జాతీయ గీతం (జనగణమన) తరహాలోనే వందేమాతరానికి కూడా ప్రోటోకాల్ ఉండాలని స్పష్టం చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. బుధవారం (ఫిబ్రవరి 11, 2026) ఉదయం నుంచే ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఇప్పటివరకు అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే పాడేవారు. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం.. 1937లో తొలగించబడిన నాలుగు చరణాలను తిరిగి కలిపి, మొత్తం ఆరు చరణాలను పాడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పూర్తి గేయం ఆలాపనకు సుమారు 3 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుంది.

కొత్త నిబంధనలు ఇవే:

ముందుగా వందేమాతరం: ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం లేదా పాఠశాల ప్రార్థనలో జాతీయ గీతం (జనగణమన) కంటే ముందే వందేమాతరం గేయాన్ని ప్లే చేయాలి లేదా ఆలపించాలి.
నిలబడటం తప్పనిసరి: వందేమాతరం పాడుతున్నప్పుడు సభికులందరూ గౌరవసూచకంగా నిలబడటం తప్పనిసరి. అయితే, సినిమా హాళ్లలో డాక్యుమెంటరీలు లేదా సినిమాల్లో భాగంగా ఈ గేయం వస్తే నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అధికారిక కార్యక్రమాలు: పద్మ అవార్డుల ప్రదానోత్సవం, రాష్ట్రపతి లేదా గవర్నర్లు హాజరయ్యే కార్యక్రమాలు, వారి రాక, వెళ్లిపోయే సమయంలో ఈ గేయాన్ని ప్రదర్శించాలి.
పాఠశాలల్లో అమలు: దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలో జాతీయ గీతానికి ముందు వందేమాతరం పాడాలని హోం శాఖ సూచించింది.

వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా (1875-2025) ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది. గతంలో ఈ గేయంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ వివాదం నెలకొంది. 1937లో కొన్ని చరణాలను తొలగించడం ద్వారా అప్పట్లో కాంగ్రెస్ దేశ సంస్కృతిని విస్మరించిందని బీజేపీ విమర్శించగా, దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఎవరైనా జాతీయ గేయానికి ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించినా లేదా గౌరవించకపోయినా 'జాతీయ గౌరవ అవమాన నిరోధక చట్టం' కింద గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు