/rtv/media/media_files/2025/10/26/maoist-leader-asanna-2025-10-26-06-55-13.jpg)
Maoist leader Asanna's video released
Ashanna: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లొంగుబాటు నేపథ్యంలో ఆ పార్టీ నాయకత్వం చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు మాజీ అగ్రనేత తక్కళ్లపల్లి వాసుదేవరావు ఎలియాస్ ఆశన్న ఖండించారు. సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే తాము లొంగిపోయినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ప్రకారం.. కేంద్ర బలగాల నిర్బంధం పెరిగిన దృష్ట్యా మావోయిస్టు పార్టీకి నష్టం జరగొద్దనే ఉద్దేశంతోనే సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీలో సమష్టిగా నిర్ణయం తీసుకున్నామని ఆశన్న స్పష్టం చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బీఆర్ దాదా అలీయాస్ నంబళ్ల కేశవరావు( బస్వరాజ్) నాయకత్వంలోనే కింది స్థాయి నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తమ లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ చేస్తున్న ఆరోపణలపై మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న (రూపేశ్) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కోవర్టులుగా మారి పార్టీకి ద్రోహం చేశామన్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. సాయుధ పోరాటాన్ని విరమించాలనే నిర్ణయం బస్వరాజ్ బతికుండగానే ఆయన నాయకత్వంలో తీసుకున్నదేనని తేల్చి చెప్పారు. ఈ మేరకు లొంగిపోయిన ఇతర మావోయిస్టులతో కలిసి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మావోయిస్టు పార్టీ నుంచి ఎవరు బయటకు వచ్చినా ద్రోహులు అనడం పరిపాటి. అందుకే మొదట ఈ విషయంలో స్పందించవద్దని అనుకున్నాం. కానీ, పార్టీకి జరిగిన నష్టానికి మేమే కారణమని, కోవర్టులుగా పనిచేశామని ఆరోపిస్తుండటంతో సమాధానం చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాం" అని ఆశన్న తెలిపారు. అడవి మార్గాన్ని వీడే క్రమంలో సాయుధ పోరాట విరమణ, శాంతి చర్చలు అనే రెండు అంశాలపై కేంద్ర కమిటీలో చర్చ జరిగిందని, చివరికి సాయుధ పోరాట విరమణకే మొగ్గు చూపినట్లు ఆయన వివరించారు. ‘‘మేం 210 మంది అడవుల్లో నుంచి బయటకు రావడంపై ఎలాంటి ఒత్తిడి లేదు. సాయుధ పోరాట విరమణ చేయాలనేది ఏప్రిల్,-మే నెలల్లో బస్వరాజ్ నాయకత్వంలోనే జరిగాయని, ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి తిరిగి వచ్చి చెప్పలేరనే ధైర్యంతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆశన్న తీవ్రంగా విమర్శించారు.
సాయుధ పోరాట విరమణ విషయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ రాసిన చివరి లేఖను పార్టీలోని కొంతమంది కీలక నేతలు దాచిపెట్టారని ఆశన్న సంచలన ఆరోపణ చేశారు. "మే 18న బస్వరాజ్ తన చివరి లేఖ పంపిన తర్వాతే ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆ తర్వాత నేను కొందరు కేంద్ర కమిటీ సభ్యులను కలిసిన సమయంలో ఆ లేఖను చూపించాను. మనం ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోలేదని, పార్టీని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని బస్వరాజ్ ఆ లేఖలో స్పష్టంగా రాశారన్నారు. అయితే మే 13న ఆయన కేంద్ర కమిటీ సభ్యులందరికీ రాసిన లేఖను మాత్రం ఒకరిద్దరు చదివి, మిగతావారికి ఇవ్వకుండా దాచిపెట్టారు. ఆ లేఖ బయటకు వస్తే వాస్తవాలు తెలుస్తాయనే భయంతోనే ఇలా చేస్తున్నారు" అని ఆశన్న ఆరోపించారు.
సాయుధ పోరాట విరమణ నిర్ణయం గురించి ప్రజాస్వామిక సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఎందుకు తొందర పడుతున్నాయి? హైదరాబాద్‌లో కూర్చున్న బుద్ధిజీవులు కొందరు ఆయుధాలే ముఖ్యమని అంటున్నారు. మా శవాలు వస్తే ఎర్రజెండాలు పట్టుకుని ఊరేగింపులు చేద్దామనుకుంటున్నారా? దారులన్నీ మూసుకుపోయినప్పుడు ఏ లక్ష్యం కోసం ప్రాణత్యాగం చేయాలి?" అని ఆయన ప్రశ్నించారు. పౌరహక్కుల సంఘాల నేతలు రెండు వైపులా వాదనలు వినకుండా ఏకపక్షంగా ఎలా నిర్ధారణకు వస్తారని నిలదీశారు. తాము అందుబాటులోనే ఉన్నామని, వాస్తవాలు తెలుసుకోవాలంటే తమను సంప్రదించవచ్చని సూచించారు. తమలో ఇంకా విప్లవతత్వం ఉందని, ఎలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం తాము లొంగిపోలేదని ఆశన్న స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజల మధ్య ఉండి ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని తెలిపారు. త్వరలోనే అందరి సలహాలు తీసుకుని తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
Follow Us