సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆ దేశంలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా'ను ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అణగదొక్కుతున్నాయని, నార్త్ కొరియా వైపు సానుభూతిని చూపిస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు. టీవీ ఛానల్లో ఆయన చేసిన ఈ ప్రకటన.. సౌత్ కొరియాలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని చూపిస్తోంది. ఈ సందర్భంగా యూన్ సుక్ మాట్లాడుతూ.. '' నార్త్ కొరియా కమ్యూనిస్టు దళాల ద్వారా సౌత్ కొరియాకు పొంచిఉన్న ముంపు నుంచి రక్షించేందుకు, దేశ వ్యతిరేక శక్తులను అంతం చేసేందుకు.. నేను ఎమర్జెన్సీ మార్షియల్ లా ను ప్రకటిస్తున్నాని'' తెలిపారు.
ఈ మార్షియల్ చట్టం ద్వారా సౌత్ కొరియాను స్వేచ్ఛయుతా, ప్రజాస్వామ్య దేశంగా పునర్నిర్మిస్తానని పేర్కొన్నారు. దేశ వ్యతిరేక శక్తుల నుంచి ప్రజలను రక్షించేందుకు, వారి భద్రతను, స్వేచ్ఛను కాపాడేందుకు ఈ చర్య అవసరమని ఉద్ఘాటించారు. పార్లమెంటులో మెజార్టీ కలిగి ఉన్న ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ.. తన చర్యల ద్వారా ప్రభుత్వాన్ని బందీగా ఉంచిందని యూన్ విమర్శలు చేశారు. ఇదిలాఉండగా.. 2022లో మే యూన్ సుక్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష పార్టీ నియంత్రణలో ఉన్న జాతీయ అసెంబ్లీలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దేశ ప్రజలను రక్షించేందుకు ఆయన తాజాగా 'ఎమర్జెన్సీ మార్షియల్ లా' ను ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.