గత కొన్నిరోజులుగా తిరుపతి లడ్డూ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని సాయిబాబా విగ్రహాలను తొలగించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇంతకీ అసలేం జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో 14 ఆలయాల్లో 'సనాతన్ రక్షక్ సేన' అనే సంస్థ సాయిబాబా విగ్రహాలను తొలగించింది. మరికొన్ని సాయి బాబా విగ్రహాలకు ముసుగులు వేసింది. అజయ్ శర్మ అనే వ్యక్తి ఈ సనాతన్ రక్షక్ సేనకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే వారాణాసీలోని మరో 28 ఆలయాల్లో సాయిబాబా విగ్రహాల తొలగించాలనే లక్ష్యంతో ఈ సంస్థ ముందుకళ్తోంది.
Also Read: ఆ సమయంలో ప్రధాని మోదీ నుంచి కాల్‌ను తిరస్కరించాను: వినేశ్ ఫొగాట్
సాయిబాబా ఉండకూడదు
సాయిబాబా విగ్రహాల తొలగింపుపై అజయ్ శర్మ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' సాయిబాబా భక్తులు.. ఆయనకు సంబంధించిన గుడిలో మాత్రమే పూజలు చేసుకోవాలి. సనాతన ధర్మంపై అవగాహన లేని కొంతమంది సాయి బాబా విగ్రహాలకు ఇతర దేవాలయాల్లో ప్రతిష్ఠించారు. చనిపోయిన వ్యక్తి విగ్రహం.. గుడిలో ఉండకూడదు. సనాతన ధర్మంలో ఇది లేదు. సూర్య, విష్ణు, శివ, శక్తి, గణేష్.. ఈ ఐదు దేవుళ్లు, దేవతల విగ్రహాలు మాత్రమే గుడిలో ప్రతిష్ఠించి పూజించాలి. మరోవైపు శంకరాచార్య స్వామి స్వరూపనందా సరస్వతి కూడా ఈ అంశంపై స్పందించారు. ''సాయిబాబా హిందూ దేవుడు కాదు. ప్రాచీన గ్రంథాల్లో సాయిబాబా పేరు ప్రస్తావన లేదని'' అన్నారు.
సాయిబాబాను ఆరాధించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని సనాతన్ రక్షక్ సేన సభ్యులు అన్నారు. హిందూ దేవుళ్లు, దేవతల ఆలయాల్లో సాయి బాబా విగ్రహాలు ఉండేందుకు తాము అనుమతించమని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. సాయిబాబా విగ్రహాలు తొలగించడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వివాదం చర్చనీయాంశమవుతోంది.