/rtv/media/media_files/2025/10/01/a-hundred-years-of-rss-2025-10-01-13-11-08.jpg)
A hundred years of RSS
RSS : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏర్పాటు అయి సరిగ్గా వందేళ్ళు అవుతోంది. 1925 అక్టోబర్ 25 విజయదశమి వేళ ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ధి ఉత్సవాలను జరుపుకుంటోంది. బ్రిటిష్ ఇండియాగా దేశం ఉన్న సమయంలో ఆర్ఎస్ఎస్ పుట్టింది. ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భవించిన మరో 25 ఏళ్లకు గానీ దేశానికి స్వాతంత్ర్యం రాలేదు. ఇదిలా ఉంటే మహాత్మా గాంధీ 1915 తరువాత భారత దేశంలో స్వతంత్ర్య పోరాటం వైపు అడుగులు వేశారు. ఆయన స్వతంత్ర్య పోరాటంలో పూర్తి యాక్టివ్ గా మారారు. అదే సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భవించింది. ఒకవైపు స్వరాజ్య పోరాటం ఉదృతంగా సాగుతున్న వేళ ఆర్‌ఎస్‌ఎస్ పురుడు పోసుకుంది.
1885లో ఏర్పాటు అయిన కాంగ్రెస్ ద్వార అప్పటికే దేశంలో చురుకుగా స్వాతంత్ర్య పోరాటం సాగుతోంది. అయితే ఈ దశలో ప్రత్యేకించి మరో సంస్థ ఆవిర్భవించడానికి కారణాలు ఏమిటి అని అందరికీ అనుమానం రావచ్చు. అయితే అప్పటి రాజకీయ సామాజిక పరిస్థితులు కూడా దీనికి కారణం కావచ్చు. అదే విధంగా ఆ సమయంలో అనేక భావజాలాలతో పలు సంస్థలు ఏర్పాటు అయినప్పటికీ అవి తదనంతర కాలంలో పూర్తి జవసత్వాలతో కొనసాగలేక ఆగిపోయాయి. కానీ ఆర్ఎస్ఎస్ మాత్రం నాటి నుంచి నేటి దాకా తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తూ వస్తోంది.
ఆర్ఎస్ఎస్ 1925 లో డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ స్థాపించారు. ఆ తరువాత ఆర్ఎస్ఎస్ తన ప్రస్థానాన్ని పెంచుకుంటూ వస్తోంది. అనేక భాగాలుగా, శాఖలుగా విస్తరించి బ్రిటిష్ ఇండియాలో, తదనంతర స్వతంత్ర్య భారతదేశంలో తన వంతు పాత్రను పోషించింది. ఇక సేవా, విద్యా, రాజకీయ సాంస్కృతిక విభాగాలు ఆర్ఎస్ఎస్ లో కీలకంగా పనిచేస్తూ వచ్చాయి. అందులో రాజకీయ విభాగంగా బీజేపీ ఉంది. బీజేపీకి పూర్వం రూపం జనసంఘ్. అది 1953లో ప్రారంభం అయింది. 1977లో జనతా పార్టీగా మారినపుడు అందులో విలీనం అయింది. అయితే ఆ తర్వాత 1980లో బీజేపీగా రూపాంతరం చెందింది. దానికి తొలి అధ్యక్షుడుగా వాజ్ పేయ్ వ్యవహరించారు.
ఆర్ఎస్ఎస్ అనేక సార్లు దేశంలో నిషేధానికి గురైంది. మొదటి సారి 1948 జనవరి 30న మహాత్మాగాంధీ హత్య తరువాత వచ్చిన అభియోగాల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ మీద నిషేధం విధించారు. ఆ తరువాత మరి కొన్ని సందర్భాల్లోనూ అలాగే జరిగింది. అయితే నిషేధించినా కూడా ఆర్ఎస్ఎస్ ప్రయాణం ఎక్కడా ఆగలేదు. అందుకే ఈ రోజు వందేళ్ల పండుగకు సిద్ధమైంది.
ఇక ఆర్ఎస్ఎస్ ఎంతోమంది నాయకులను దేశానికి అందించింది. అందులో ప్రముఖులు వాజ్ పేయి ఎల్ కే అద్వానీ, రాం నాథ్ కోవింద్, నరేంద్ర మోడీ, ఎం వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీ వంటి వారు ఎందరో ఉన్నారు. వీరే కాదు బీజేపీలో ఉన్న వారిలో అత్యధిక శాతం ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వారే అని చెప్పకతప్పదు. అలా చూస్తే ఆర్ఎస్ఎస్ ఈ దేశానికి ప్రధానులను ఉప ప్రధానులను రాష్ట్రపతులను అందించింది.
ఇక తిధి ప్రకారం ఆర్ఎస్ఎస్ వందేళ్ళ పండుగను చేసుకుంటుంది. ఆవిర్భవించింది అక్టోబర్25 అయినప్పటికీ అలా చూస్తే కనుక అక్టోబర్ 1న మధ్యాహ్నం నుంచి దశమి వస్తోంది. దాంతో ఆ రోజున ఆర్ఎస్ఎస్ వందేళ్ళ వేడుకను ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ చారిత్రక ప్రయాణాన్ని తెలియచేసే స్మారక తపాల బిళ్ళతో పాటు నాణేలను విడుదల చేశారు. ఎపుడో ఒక చిన్న సంస్థగా ఆవిర్భవించిన ఆర్ఎస్ఎస్ వందేళ్ల సుదీర్ఘ ప్రస్థానంగా ముందుకు సాగడం ఈ శతాబ్ది ఉత్సవాలు నాటికి దేశంలో బీజేపీ అధికారంలో ఉండడం ఆ సంస్థ సాధించిన గొప్ప విజయంగానే భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: తమిళనాడులో దారుణం...ఆంధ్రయువతిపై ఖాకీ కామాంధుల అత్యాచారం