Republic Day 2026: ఈ సారి రిపబ్లిక్ డే చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా?

ఈ ఏడాది ‘కర్తవ్య పథ్’పై జరిగే పరేడ్ అనేక చారిత్రక ఘట్టాలకు, సరికొత్త ప్రయోగాలకు వేదిక కానుంది. ముఖ్యంగా ఐరోపా సమాఖ్యకు చెందిన ఇద్దరు కీలక నేతలు ముఖ్య అతిథులుగా రావడం, సైన్యంలో కొత్తగా చేరిన ‘భైరవ’ బెటాలియన్ తన ప్రతాపాన్ని చాటనుండటం ఈసారి ప్రత్యేకత.

New Update
Republic Day 2026

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీ ఘనంగా ముస్తాబవుతోంది. ఈ ఏడాది ‘కర్తవ్య పథ్’పై జరిగే పరేడ్ అనేక చారిత్రక ఘట్టాలకు, సరికొత్త ప్రయోగాలకు వేదిక కానుంది. ముఖ్యంగా ఐరోపా సమాఖ్యకు చెందిన ఇద్దరు కీలక నేతలు ముఖ్య అతిథులుగా రావడం, సైన్యంలో కొత్తగా చేరిన ‘భైరవ’ బెటాలియన్ తన ప్రతాపాన్ని చాటనుండటం ఈసారి ప్రత్యేకత.

ముఖ్య అతిథులుగా ఐరోపా నేతలు

భారతదేశ విదేశాంగ విధానంలో ఈ ఏడాది గణతంత్ర వేడుకలు మైలురాయిగా నిలవనున్నాయి. చరిత్రలో తొలిసారిగా ఇద్దరు దేశాధినేతలు/సంస్థల అధిపతులు కలిసి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. వీరి రాక భారత్-ఈయూ మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

'భైరవ' బెటాలియన్

ఈ ఏడాది పరేడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించబోయేది 'భైరవ లైట్ కమాండో బెటాలియన్'. 2025 అక్టోబర్‌లో ఏర్పాటైన ఈ దళం, సాధారణ పదాతి దళం, స్పెషల్ ఫోర్సెస్ మధ్య వారధిగా పనిచేస్తుంది. ప్రతి బెటాలియన్‌లో సుమారు 250 మంది అత్యంత శిక్షణ పొందిన సైనికులు ఉంటారు. సరిహద్దుల్లో మెరుపు దాడులు చేయడం, శత్రువుల కదలికలను ముందే పసిగట్టడంలో వీరు సిద్ధహస్తులు. ప్రస్తుతం ఇలాంటి 15 బెటాలియన్లు రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ సరిహద్దుల్లో పహారా కాస్తున్నాయి.

తొలిసారిగా జంతువుల విన్యాసాలు

ఆర్మీకి చెందిన రిమౌంట్ అండ్ వెటర్నరీ వింగ్ ఈసారి సరికొత్త ప్రదర్శనతో రానుంది. లడఖ్ సరిహద్దుల్లో నిఘా పెట్టే రెండు బాక్ట్రియన్ ఒంటెలు. నాలుగు జాస్కరీ గుర్రాలు, శత్రువులపై దాడి చేసే నాలుగు వేట పక్షులు. పది మిలిటరీ డాగ్స్ తొలిసారిగా మార్చ్ పాస్ట్ చేయనున్నాయి.

గగనతలంపై విన్యాసాలు

ఫ్లైపాస్ట్‌లో రాఫెల్, ఎస్యూ-30, అపాచీ హెలికాప్టర్లతో సహా మొత్తం 29 యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు చేయనున్నాయి. అయితే, ఈసారి స్వదేశీ యుద్ధ విమానం 'తేజస్' పరేడ్‌లో పాల్గొనడం లేదు. ఆయుధ సంపత్తిలో బ్రహ్మోస్, ఆకాష్ మిసైల్ సిస్టమ్స్, ధనుష్ గన్‌లు, అధునాతన డ్రోన్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

మరికొన్ని విశేషాలు:
వందేమాతరం లోగో: వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆహ్వాన పత్రికలపై ప్రత్యేక లోగోను ముద్రించారు.

నదుల పేర్లతో ఎన్‌క్లోజర్లు: పాత వివిఐపీ లేబుళ్లకు స్వస్తి పలికి, గంగా, యమునా వంటి భారతీయ నదుల పేర్లను ఎన్‌క్లోజర్లకు పెట్టారు.

వాయిద్యాల పేర్లు: జనవరి 29న జరిగే 'బీటింగ్ రిట్రీట్' వేదికపై వీణ, తబలా, వేణువు వంటి వాయిద్యాల పేర్లతో సీటింగ్ అరేంజ్మెంట్స్ చేశారు.

శకటాల ప్రదర్శన: వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే 17 శకటాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన 13 శకటాలు ప్రదర్శిస్తారు.

ట్రాఫిక్ ఆంక్షలు: రిహార్సల్స్ కారణంగా జనవరి 17, 19, 20, 21 తేదీల్లో ఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి ఇండియా గేట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అలాగే, జనవరి 21 నుండి 29 వరకు రాష్ట్రపతి భవన్ సందర్శనకు అనుమతి ఉండదు.

Advertisment
తాజా కథనాలు