Union Budget: బడ్జెట్ ప్రసంగాల్లో రికార్డులివే.. చరిత్రలో ఎప్పటికీ నిర్మలమ్మ, మన్మోహన్ సింగ్‌ పేర్లు

భారత పార్లమెంటు చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కే దక్కుతుంది. అలాగే ప్రసంగంలోని పదాల సంఖ్య పరంగా చూస్తే, మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రికార్డు నేటికీ చెక్కుచెదరకుండా ఉంది.

author-image
By K Mohan
New Update
Union Budget speeches

ప్రతి ఏటా ఫిబ్రవరి 1న దేశ ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోతారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివే బడ్జెట్ ప్రసంగం కేవలం అంకెల గారడీ మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అయితే ఇప్పటి వరకూ బడ్జెట్ ప్రవేశపెట్టిన కొంతమందిపై రికార్డులు కూడా ఉన్నాయి. పార్లమెంటు చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేసిన ఘనత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కే దక్కుతుంది. అలాగే ప్రసంగంలోని పదాల సంఖ్య పరంగా చూస్తే, మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రికార్డు నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు వరుసగా తొమ్మిదో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

నిర్మలా సీతారామన్

టైం పరంగా చూస్తే, భారత పార్లమెంటులో అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరిట ఉంది. 2020 ఫిబ్రవరి 1న ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి చరిత్ర సృష్టించారు. ప్రసంగం మధ్యలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. దీంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె తరపున చివరి 2 పేజీలను చదివారు. అంతకుముందు 2019లో కూడా ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించి తన సొంత రికార్డును తానే తిరగరాశారు.

మన్మోహన్ సింగ్

ప్రసంగంలోని పదాల సంఖ్య పరంగా చూస్తే, మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రికార్డు నేటికీ చెక్కుచెదరకుండా ఉంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన 1991 బడ్జెట్ ప్రసంగంలో ఆయన ఏకంగా 18,650 పదాలను ఉపయోగించారు. దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసిన ఈ ప్రసంగం పదాల పరంగా ఇప్పటికీ ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

1977లో అప్పటి ఆర్థిక మంత్రి హీరూభాయ్ ముల్జీభాయ్ పటేల్ కేవలం 800 పదాలతో తన ప్రసంగాన్ని ముగించారు. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యంత చిన్న బడ్జెట్ ప్రసంగం. మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 సార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టి అగ్రస్థానంలో ఉన్నారు. బడ్జెట్ ప్రసంగం నిడివి పెరుగుతున్న కొద్దీ, అందులో ప్రవేశపెట్టే పథకాలు, సంస్కరణల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. డిజిటల్ యుగంలో ఇప్పుడు ఈ ప్రసంగాలు 'పేపర్‌లెస్'గా మారుతున్నా, ఆర్థిక మంత్రుల ప్రసంగ పాఠాలు మాత్రం ఆసక్తికరమైన చర్చలకు దారితీస్తూనే ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు