అత్యంత గౌరవనీయమైన, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు దేశ ప్రజలు సంతాపం తెలుపుతున్నారు. ఎన్నో కంపెనీలను స్థాపించి తిరుగులేని వ్యాపారవేత్తగా తనదైన ముద్ర వేసిన ఆయన ఒక సామాన్యుడి లాగే జీవితాన్ని గడిపారు. రతన్ టాటాకు భార్యా, పిల్లలు లేరు. ఇలా భార్యా, పిల్లలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారనే దానిపై స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఆయనే వివరణ కూడా ఇచ్చారు. కొన్నిసార్లు భార్యా, పిల్లలు, కుటంబం లేరనే విషయం గుర్తుకువచ్చి ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతానని అన్నారు. అలాగే మరికొన్ని ఇంకొకరి గురించి ఆలోచించడం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే స్వేచ్ఛను ఆనందిస్తానని పేర్కొన్నారు.
Also Read: రతన్ టాటా అంత్యక్రియలు.. ఏ సంప్రదాయం ప్రకారం అంటే?
వాస్తవానికి రతన్ టాటాకు ఆయన తాత పేరు రతన్‌జీ టాటా పేరు పెట్టారు. రతన్ జీ, ఆయన భార్య నవాజీ భాయ్.. టాటా తండ్రి నావల్ టాటాను ఓ అనాథశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు. రతన్ టాటా తండ్రి నావల్ టాటా, తల్లి సూనూ కొన్నేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. వాళ్లు విడాకులు తీసుకునే సమయానికి రతన్ టాటాకు 10 ఏళ్లు మాత్రమే. అంతకుముందే జిమ్మీ కూడా జన్మించాడు. ఆ తర్వాత నావల్ టాటా.. స్విట్జర్లాండ్ జాతీయురాలైన సిమోన్‌ను పెళ్లి చేసుకున్నారు. రతన్ టాటా తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు నానమ్మ తనకు అండగా ఉన్నారని, తనకు మార్గనిర్దేశకత్వం చేశారని రతన్ టాటా చాలాసార్లు గుర్తుకుచేసుకున్నారు.
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో గ్రాడ్యుయేషన్ అయిపోయాక రతన్ టాటా రెండేళ్లపాటు అక్కడే పనిచేశారు. ఆ సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో కూడా పడ్డారు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ రతన్ టాటా నానమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ఇండియాకు వచ్చేశారు. నానమ్మను చూసుకునేందుకు రతన్ టాటా ఏడేళ్లపాటు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తన ప్రేయసి ఇండియాకు వస్తుందని రతన్ టాటా భావించారు. కానీ ఆ సమయంలో 1962లో భారత్- చైనా మధ్య యుద్ధం జరుగుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు పంపించేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఇలా వారి ప్రేమ బంధానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత రతన్ టాటాపై టాటా గ్రూపును నడిపించాల్సిన బాధ్యత పడింది. దీంతో ఆయన తీరిక లేకుండా పనిలో బిజీ అయిపోవడంతో పెళ్లి చేసుకోలేకపోయానని మరో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.