మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార, విపక్ష పార్టీలు ప్రచారంలో బిజీబిజీ అయిపోయాయి. మరోవైపు ప్రచారంలో పాల్గొనే నేతల బ్యాగులు, హెలికాప్టర్లలో తనిఖీలు కూడా కొనసాగుతున్నాయి. అయితే తాజాగా అమరావతిలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్‌గాంధీ బ్యాగులను ఎన్నికల అధికారులు చెక్ చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన అమరావతిలో ల్యాండ్ అయిన తర్వాత అధికారులు తనిఖీ చేశారు.
Also Read: మావోయిస్టుల కోసం గాలింపులు.. అమరవీరుల స్తూపాలు కూల్చివేత
రాహుల్ తన వెంట తెచ్చుకున్న బ్యాగులతో పాటు హెలికాప్టర్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇలా చెక్ చేస్తున్న సమయంలో రాహుల్ తన పార్టీ నేతలతో మాట్లాడుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా.. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను కూడా ఎన్నికల అధికారులు ఇటీవల పలుమార్లు తనిఖీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఎన్నికల వేళ ఇది సాధారణ ప్రక్రియే ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది.
అలాగే సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్, దేవంద్ర ఫడ్నవీస్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితర ఎన్డీయే నేతల బ్యాగులను సైతం ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. తన హెలికాప్టర్‌ను ఎన్నికల సంఘం బృందం పరిశీలిస్తున్న దృశ్యాలను కూడా అమిత్ షా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
Also Read: పెళ్లి పేరుతో మైనర్ బాలికను తల్లిదండ్రులు.. ఏం చేశారంటే?
పక్షపాత రహిత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తుందంటూ పేర్కొన్నారు. అలాగే ఈ ఏడాది పార్లమెంటు ఎన్నికల సమయంలో కూడా రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను ఈసీ అధికారులు చెక్ చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి మహారాష్ట్రంలో మహాయతీ కూటమా ? లేదా మహా వికాస్ అఘాడి కూటమి వస్తుందా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.