కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బహుజన వ్యతిరేకి అంటూ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా కూడా రిజర్వేషన్లు కాపాడుకుంటామని పేర్కొన్నారు. కుల గణన పేరు చెప్పేందుకే ప్రధాని మోదీ భయపడుతున్నారని ఆరోపించారు. బహుజనులు వారి హక్కులను పొందడం బహుశా ఇష్టం లేదేమోనని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించి సమగ్ర కులగణన చేసి ప్రతీ వర్గానికి హక్కులు, వాటా, న్యాయం జరిగేవరకు ఆగేది లేదని స్పష్టం చేశారు. కుల గణన అనేది దేశంలో రాజకీయ సమస్య మాత్రమే కాదని.. వెనకబడిన వర్గాల వారికి న్యాయం చేయడమే తమ జీవిత ఆశయమని తెలిపారు.
Also Read: తప్పు ఎవరిది? వాళ్ల ఏడుపు వెనక ఎవరూ ఊహించని కన్నింగ్ కథ!
ఇదిలాఉండగా రాహుల్ గాంధీ ఇప్పటికే పలుమార్లు రిజర్వేషన్ల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన అమెరికా పర్యటనలో కూడా రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం ఇండియాలో ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అన్నారు. అప్పటివరకు అభివృద్ధిలో వారి భాగస్వామ్యం అంతగా లేదన్నారు. దేశంలో అన్ని వర్గాల వారికి పారదర్శకంగా అవకాశాలు వచ్చిన తర్వాతే తమ పార్టీ రిజర్వేషన్ల రద్దు గురించి ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాహుల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.