Budget 2026: బడ్జెట్‌పై విపక్షాల మండిపాటు.. ఎవరేమన్నారంటే?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ బడ్జెట్ సామాన్యులకు శూన్యమని, కేవలం అంకెలు మార్చిన పాత పథకాల సమాహారమని విమర్శించాయి.

New Update
Budget 2026

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్‌సభలో ప్రవేశపెట్టినకేంద్ర బడ్జెట్ 2026పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఈ బడ్జెట్ సామాన్యులకు శూన్యమని, కేవలం అంకెలు మార్చిన పాత పథకాల సమాహారమని విమర్శించాయి. యువత, రైతులు, మధ్యతరగతి ప్రజల ఆశలను కేంద్రం తుంచేసిందని ప్రధాన ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ బడ్జెట్‌ను తీవ్రంగా తప్పుపట్టారు. దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లయిన నిరుద్యోగం, తయారీ రంగం పతనం, రైతుల సంక్షోభం గురించి బడ్జెట్‌లో కనీస ప్రస్తావన లేదని ఆయన విమర్శించారు. అంతర్జాతీయంగా భారత్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నా, దేశం లోపల ఉన్న వాస్తవ పరిస్థితులను కేంద్రం కావాలనే విస్మరిస్తోందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మాట్లాడుతూ.. ఇది చాలా చిన్న ప్రసంగమని, భవిష్యత్తుపై ఎటువంటి స్పష్టత లేదని అన్నారు. కేరళలో ఎయిమ్స్ కోసం 15 ఏళ్లుగా ఎదురుచూస్తుంటే, ఆ ఊసే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్ పెడతామని చెప్పినా, దాని వేదికను ప్రకటించకపోవడం హాస్యాస్పదమన్నారు.

జైరాం రమేష్ స్పందిస్తూ.. బడ్జెట్ ప్రసంగం ఏమాత్రం పారదర్శకంగా లేదని, కీలక సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధుల వివరాలను దాచిపెట్టారని ఆరోపించారు.

మహిళలు, యువతకు వ్యతిరేకం: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బడ్జెట్‌ను 'పేలవం'గా అభివర్ణించారు. ఇది మహిళలు, రైతులు, యువత ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. బెంగాల్‌కు నిధుల కేటాయింపులో మొండిచేయి చూపారని, ఒక గంటా ఇరవై ఐదు నిమిషాల ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని ఆమె విమర్శించారు.

విద్య లేని నవభారతమా?: అఖిలేష్ యాదవ్
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విద్యా రంగంపై ప్రభుత్వం చూపుతున్న వివక్షను ఎండగట్టారు. "విద్యకు నిధులు ఇవ్వకుండా నవభారతాన్ని ఎలా నిర్మిస్తారు?" అని ఆయన ప్రశ్నించారు. ఈ బడ్జెట్ వాస్తవాలకు చాలా దూరంగా ఉందని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు