/rtv/media/media_files/2026/01/17/it-2026-01-17-07-17-42.jpg)
భారత ఐటీ రంగాలనికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా ఈ రంగంలో డిమాండ్ తగ్గింది. అమెరికా విధిస్తున్న టారిఫ్స్, హెచ్ 1బీ వీసా రూల్స్ కారణాలతో భారత ఐటీ కంపెనీలకు గడ్డుకాలం నడుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఈ కంపెనీల లాభాలు పడిపోతున్నాయి. మరోవైపు.. ఏఐ వినియోగాన్ని పెంచే క్రమంలో మానవ వనరుల్ని తగ్గించుకుంటున్నాయి. అత్యాధునిక స్కిల్స్ ఉన్న ఉద్యోగుల్నే కొనసాగిస్తూ.. మిగతా వారికి లేఆఫ్స్ విధిస్తున్నాయి. అయితే ఇదొక సాకు మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. తమ నష్టాలను తగ్గించుకోవడానికి ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయని చెబుతున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసిక ఫలితాలను ఐటీ దిగ్గజాలు ప్రకటిస్తున్నాయి. ముందుగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అక్టోబర్- డిసెంబర్ ఫలితాల్ని ప్రకటించగా తర్వాత వరుసగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ కూడా ఫలితాలు విడుదల చేశాయి. వీటిల్లో కంపెనీల ఆదాయం ఏమీ తగ్గిపోలేదు కానీ లాబాలు మాత్రం రాలేదు. నికర లాభం అన్ని కంపెనీలకు తగ్గింది. ఇలా జరగడం చాలా అరుదని చెబుతున్నారు. ఈ సారి నికర లాభాలు తగ్గడానికి కారణం అంతర్జాతీయ పరిణామాలతో పాటూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లేబర్ కోడ్ అని చెబుతున్నారు.
సర్దుబాట్లు చేస్తున్న కంపెనీలు..
కొత్త చట్టంలో నిబంధనలకు అనుగుణంగా ఐటీ కంపెనీలు ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో సర్దుబాట్లు చేయాల్సి వస్తోంది. దీంతో కంపెనీలు వేల కోట్లను వన్ టైమ్ కాస్ట్ కింద ఇప్పుడు ఫలితాల్లో చూపించాయి. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం ఫలితాల ప్రకారం.. ఈ 3 కంపెనీలు కలిసి మొత్తంగా రూ. 4,373 కోట్ల మేర అదనపు భారాన్ని భరించాయి. కొత్త లేబర్ కోడ్స్ అమలు చేసేందుకు టీసీఎస్ అత్యధికంగా రూ. 2,128 కోట్లు కేటాయించింది. దీంట్లో రూ. 1800 కోట్లను ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం, మరో రూ. 300 కోట్లను లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సర్దుబాటు కోసం ఖర్చు చేసింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కూడా రూ. 956 కోట్లు వెచ్చించింది. భారత రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ రూ. 1289 కోట్ల మేర అదనపు భారాన్ని భరించింది. దీంతో కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్లు 21 శాతం నుంచి 18.4 శాతానికి పడిపోయాయి.
ఉద్యోగులకు అత్యధిక ప్రాధాన్యత..
కొత్త లేబర్ కోడ్ లో ఉద్యోగులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వీటి ప్రకారం ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు వేతనంలో (CTC).. బేసిక్ పే కనీసం 50 శాతంగా ఉండాలి. ఇంతకు ముందు అంతా కంపెనీలు బేసిక్ పే తక్కువగా ఇస్తూ.. ఇతర అలవెన్సుల రూపంలో ఎక్కువగా ఇచ్చేవి. ఇప్పుడు బేసిక్ పే పెంచాల్సి రావడం వల్ల.. కంపెనీలు చెల్లించాల్సినటువంటి గ్రాట్యుటీ, పీఎఫ్ చెల్లింపుల వాటా పెరిగింది. కొత్త రూల్స్ ప్రకారం..పాత సర్వీసు కాలానికి కూడా గ్రాట్యూటీని సర్దుబాటు చేయాల్సి వస్తోంది. దీని కారణంగా కంపెనీల మరింత భారం పడుతోంది. దాంతో కంపెనీల లాభాలపై ప్రభావం పడుతోంది. భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
Follow Us